ముగ్గురు మంత్రులకు ప్రతిష్టాత్మకం

– మిత్రులే శతృవులయ్యారు
– హోరాహోరీగా ఖమ్మం, భద్రాద్రి మున్సిపల్ పోరు
– కొన్నిచోట్ల వేరే పార్టీల గుర్తులతో టీడీపీ

ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : రాష్ట్రంలో ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లా ఖమ్మం మాత్రమే. మున్సిపల్ పోరు వారికి ప్రతిష్టాత్మకంగా మారింది. ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలో మధిర మున్సిపాల్టీ ఉంది. మధిరలో 22 వార్డులు ఉండగా కాంగ్రెస్ 19మంది, బీఆర్ఎస్ 17మంది, బీజేపీ 19మంది, సిపిఐ 1 అభ్యర్థి, సీపీఐ(ఎం) నుంచి ముగ్గురు పోటీలో నిలిచారు. ఇతరులు 11మంది పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ ఒంటరి పోరు చేస్తుండగా బీఆరఎస్, సీపీఎం కలిసి పోటీ చేస్తున్నాయి. గతంలో ఇక్కడ చైర్మన్ పీఠం బీఆర్ఎస్ దే. మధిర పక్కన ఉన్న వైరా నియోజకవర్గంలో ఉన్న వైరా మున్సిపాల్టీలో 20 వార్డులు ఉండగా కాంగ్రెస్ నుంచి 18మంది, బీఆర్ఎస్ నుంచి 16 మంది, బీజేపీ నుంచి 19మంది, సిపిఐ నుంచి ఇద్దరు, సీపీఐ(ఎం) నుంచి ముగ్గురు బరిలో నిలిచారు. ఇతరులు 22 మంది పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్, సీపీఎం కలిసి పోటీలో ఉన్నాయి. టీడీపీ కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచారం చేసింది. గతంలో ఇక్కడ కూడా బీఆర్ఎస్ ఖాతాలోనే మున్సిపల్ పాలకవర్గం ఉంది. సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి మున్సిపాల్టీలో 23 వార్డులకు కాంగ్రెస్ నుంచి 23మంది, బీఆర్ఎస్ నుంచి 22 మంది, బీజేపీ నుంచి 22మంది, సీపీఐ(ఎం) నుంచి ఒకరు పోటీలో ఉన్నారు. ఇతరులు 16మంది ఉన్నారు. ఇక్కడ గతంలో మున్సిపల్ చైర్మన్‌గిరీ బీఆర్ఎస్‌దే. నూతనంగా ఏర్పడిన కల్లూరు మున్సిపాల్టీలో అదికార, ప్రతిపక్షాలు పాగా వేసేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. ఇక్కడ 20 వార్డులు ఉండగా కాంగ్రెస్ తరపున 20మంది, బీఆర్ఎస్ నుంచి 20 మంది, బీజేపీ తరపున 16మంది పోటీ చేస్తున్నారు. సీపీఎం, సీపీఐలు పోటీలో లేవు. ఇతరులు 16మంది బరిలో ఉన్నారు.

పొంగులేటి,కూనంనేని ఎత్తులు 

రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నియోజకవర్గమైన పాలేరు పరిధిలో ఉన్న ఏదులాపురం మునిపాల్టీ కొత్తగా ఏర్పాటైంది. ఇక్కడ 32 వార్డులు ఉండగా కాంగ్రెస్ నుంచి 31 మంది, బీఆర్ఎస్ నుంచి 23మంది, బీజేపీ నుంచి 24మంది, సీపీఐ నుంచి 11 మంది, సీపీఐ(ఎం) నుంచి 8 మంది, ఇతరులు 12 మంది పోటీలో ఉన్నారు. ఇక్కడ పోటీ హోరాహోరీగా ఉంది. ఏదులాపురంతోపాటు కొత్తగూడెం కార్పొరేషన్ మున్సిపల్ పోరుతో కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తులు వికటించాయి. మంత్రి పొంగులేటి, సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మధ్య తీవ్ర అగాధం ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ తొలిసారి ఏర్పాటైంది. ఏజెన్సీ చట్టాల కారణంగా పాల్వంచ మున్సిపాల్టీకి అనేక ఏళ్లుగా ఎన్నికలు జరగలేదు. దీంతో స్థానిక ఎమ్మెల్యే కూనంనేని వ్యూహాత్మకంగా కొత్తగూడెం పట్టణం, పాల్వంచ మున్సిపల్ పరిధితో కలిపి కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేశారు. మొత్తం 60 డివిజన్లు ఉండగా కాంగ్రెస్ నుంచి 58మంది, బీఆర్ఎస్ నుంచి 60మంది, బీజేపీ నుంచి 60మంది, సీపీఐ నుంచి 56 మంది, సీపీఐ(ఎం) నుంచి ఇద్దరు బరిలో నిలిచారు. అదేవిధంగా ఇతరులు 118 మంది పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, సీపీఎం కలిసి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్, సీపీఐ వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. కార్పొరేషన్‌ను కైవసం చేసుకోవాలని మంత్రి పొంగులేటి, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట మున్సిపాల్టీలో (కొత్తగా ఏర్పాటైంది) 22వార్డుల్లో కాంగ్రెస్ నుంచి 21మంది, బీఆర్ఎస్ నుంచి 22మంది, బీజేపీ నుంచి 15మంది, సిపిఐ, సీపీఎంల నుంచి ఒక్కొక్కరు పోటీలో ఉండగా, ఇతరులు 18మంది రంగంలో ఉన్నారు. కాంగ్రెస్, సీపీఎం కలిసి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తున్నది. ఇల్లెందు మున్సిపాల్టీలో 24 వార్డులు ఉండగా కాంగ్రెస్ 24మంది, బీఆర్ఎస్ నుంచి 20మంది, బీజేపీ నుంచి 17మంది, సీపీఐ నుంచి ఇద్దరు, సీపీఐ(ఎం) ఒకరు బరిలో నిలిచారు. ఇతరులు 44మంది పోటీ చేస్తున్నారు. గతంలో చైర్మన్ పీఠం బీఆరఎస్‌దే. డిప్యూటీ సీఎం భట్టి మధిర, వైరా(స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే రాందాస్ నాయక్), మంత్రి పొంగులేటి ఏదులాపురం, కల్లూరు, సత్తుపల్లి(స్థానిక ఎమ్మెల్యే రాగమయి), ఇల్లెందు(స్థానిక ఎమ్మెల్యే కనకయ్య), కొత్తగూడెం, మంత్రి తుమ్మల సత్తుపల్లి, కల్లూరు, అశ్వారావుపేటల్లో ప్రచారం చేశారు.

మూడు మున్సిపాల్టీలు కాంగ్రెస్‌కు అనుకూలం

ఖమ్మం జిల్లాలో మూడు మున్సిపాల్టీలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండగా రెండుచోట్ల పోటీ హోరాహోరీగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక కార్పొరేషన్‌లో తీవ్ర పోటీ ఉండగా రెండు పురపాలికల్లో అనుకూలంగా ఉంది. సీపీఐతో పొత్తు లేకపోవడంతో కాంగ్రెస్‌తో సీపీఎం జత కట్టింది. టీడీపీ స్థానిక పరిస్థితుల దృష్ట్యా కొన్నిచోట్ల కాంగ్రెస్, మరికొన్నిచోట్ల సిపిఐతో బరిలో ఉంది. ఆ పార్టీ గుర్తుతోకాక కలిసి వచ్చే పార్టీల గుర్తులపై పోటీ చేస్తున్నది. కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికి సీపీఐ, బిఆరఎస్ ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. పోలింగ్ దగ్గర పడుతున్న వేళ వైరా, ఏదులాపురం, కొత్తగూడెం ప్రాంతాల్లో ఓటర్లకు ప్రలోభాలు అధికమైనాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *