అసంపూర్తిగా అంబర్‌పేట ఫ్లై ఓవర్ సర్వీస్ రోడ్డు

– వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోండి
– సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 6: అంబర్‌పేట ఫ్లైఓవర్ కింద ఉన్న సర్వీస్ రోడ్డు నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి శుక్రవారం లేఖ రాశారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని, ప్రయాణ సమయాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ రూ.265 కోట్ల వ్యయంతో ఎన్‌హెచ్ -163 (గతంలో ఎన్‌హెచ్-202) మీద నగరంలోని అంబర్‌పేట క్రాస్ రోడ్డు వద్ద 1.5 కి.మీ పొడవైన 4 వరుసల ఫ్లై ఓవర్‌ను నిర్మించినట్లు గుర్తుచేశారు. 2025 మే 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఫ్లైఓవర్‌ను ఘనంగా ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమంలో తనతోపాటు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. ఈ ఫ్లై ఓవర్‌కు అవసరమైన భూసేకరణ పూర్తి కాలేదని, దీని నిర్మాణం, ప్రారంభోత్సవం కూడా పూర్తి చేసుకున్నప్పటికీ దీని కింద ఉన్న సర్వీస్ రోడ్డు నిర్మాణం మాత్రం పూర్తిస్థాయిలో జరగలేదని తెలిపారు. భూసేకరణ విషయంలో కొన్ని శక్తులు అడ్డుతగులుతుండటంతో అనవసరంగా తీవ్ర జాప్యం జరుగుతోందని అన్నారు. ఇది 2018లో మంజూరైనప్పటికీ లేని సమస్యలు సృష్టించి భూసేకరణ పూర్తి కాకుండా కుట్రలు చేసి సర్వీస్ రోడ్డు నిర్మాణం పూర్తిస్థాయిలో జరగనివ్వకపోవడంతో ఈ రహదారి వెంట ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ విషయాన్ని అప్పటి సీఎం కె.చంద్రశేఖరరావు, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డికి అనేకసార్లు తెలియజేశానని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. రాష్ట్ర మంత్రులకు స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా అనేకసార్లు తెలియజేశారన్నారు. జీహెచఎంసీ కమిషనర్, ఇతర సంబంధిత అధికారుల దృష్టికి తాను కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి అనేకసార్లు మాట్లాడినప్పటికీ ఈ సమస్య ఓ కొలిక్కి రాలేదని అన్నారు. భూసేకరణకు సంబంధించిన భూమికి రూ.2.54 కోట్ల పరిహారం లబ్దిదారులకు ప్రభుత్వం చెల్లించినప్పటికీ దళారులు అడ్డుకుంటున్నారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తిగతంగా చొరవ చూపి జీహెచ్‌ఎంసీ, రోడ్లు, భవనాల శాఖ అధికారుల ద్వారా తగిన చర్యలు తీసుకొని సర్వీస్ రోడ్డును పూర్తిస్థాయిలో నిర్మించటానికి సహకరించాలని కిషన్‌రెడ్డి కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *