– అసెంబ్లీలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: విదేశీ విద్య ఉపకార వేతనాల పథకాన్ని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. 2023 నుంచి ఇప్పటి వరకు అంబేడ్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా సుమారు 2వేల మంది విద్యార్థులకు విదేశీ విద్య ద్వారా ఉపకార వేతనాలు చెల్లించామని చెప్పారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. దీనికోసం ఇప్పటి వరకు రూ.607 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. విదేశాల్లో చదువుకునే వారికి ఈ పథకం కింద నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుందని చెప్పారు. అంతకుముందు కేటీఆర్ మాట్లాడుతూ 2025 అక్టోబర్‌లో విదేశీ విద్య ఉపకార వేతనాలు ఇస్తామని చెప్పినా ఇవ్వలేదన్నారు. విదేశాలకు వెళ్లిన విద్యార్థులు దీనికోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. అక్కడ ఫీజులు కట్టలేక, ఇక్కడికి రాలేక ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రభుత్వం దీన్ని ప్రాధాన్య అంశంగా తీసుకుని అమలు చేయాలని కోరారు. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ విదేశీ విద్య ఉపకార వేతనాలు ఎస్సీ వర్గాలకే మేలు చేస్తాయన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను వంద శాతం అమలు చేయాలని.. దీంతో ఆయా వర్గాలకు న్యాయం జరగుతుందని చెప్పారు. ఇప్పటి వరకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయలేదని.. కోనేరు రంగారావు సిఫార్సులను అమలు చేయడం లేదన్నారు. మాల, మాదిగలకు వేర్వేరు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు దానికి సంబంధించిన విధి విధానాలు రూపొందించలేదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.