– నేరుగా రండి.. అపాయింట్‌మెంట్ అవసరంలేదు
– అన్ని హంగులతో ఆడిటోరియం నిర్మాణం
– ఏఈలకు ల్యాప్‌టాప్‌లు
– పదోన్నతుల సమస్యకు ప్రాధాన్యం ఇచ్చాం
-ఆర్ అండ్ బి డైరీ ఆవిష్కరణలో మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 1: రోడ్లు భవనాలు శాఖ ఇంజనీర్లు,ఉద్యోగులు తనకు కుటుంబ సభ్యులతో సమానమని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కొత్త ఏడాదిలో మొదటి రోజే డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించుకున్న ఏకైక డిపార్ట్ మెంట్ మన ఆర్ అండ్ బి అని,తన ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏడాది మొదటి రోజే అన్ని సమగ్ర వివరాలతో కూడిన డైరీ ఆవిష్కరించడం మొదటి సారనీ ఆర్ అండ్ బి అధికారులకు కితాబిచ్చారు. 2026 నూతన సంవత్సరం పురస్కరించుకుని గురువారం ఎర్రమంజిల్ ఆర్ అండ్ బి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్ అండ్ బి ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని శాఖ ఉద్యోగుల్లో నూతనోత్సాహాన్ని నింపారు. ఉద్యోగులతో కలిసి మంత్రి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ఉపయోగకరమైన సాంకేతిక సమాచారం,శాఖా మార్గదర్శకాలు, దైనందిన విధుల నిర్వహణకు అవసరమైన వివరాలతో ఈ డైరీని రూపొందించినందుకు తెలంగాణ రోడ్లు,భవనాల ఇంజినీర్ల సంఘాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నానన్నారు. మీ సమస్యలపై నన్ను ఎప్పుడు కలవాలన్న ప్రత్యేక అపాయింట్మెంట్లు తీసుకోవాల్సిన అవసరం లేదనీ భరోసానిచ్చారు. ఉద్యోగుల కోరిక మేరకు కొత్త సంవత్సరంలో అన్ని హంగులతో కూడిన ఆడిటోరియం నిర్మిస్తామని, ఫీల్డ్ లో ఉండే ఏఈ లకు ల్యాప్ టాప్ లు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే అన్ని రకాల ప్రమోషన్స్ ఇచ్చుకున్నాం..మిగతా పెండింగ్ అంశాలు కూడా సిఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి త్వరలో పరిష్కరిస్తామన్నారు. కాలేజీలు, టిమ్స్, నిమ్స్, ఉస్మానియా హాస్పిటల్స్, హైకోర్టు, జిల్లా కోర్టులు, కలెక్టరేట్లతోపాటు 60వేల కోట్ల విలువైన రోడ్లు డబుల్ లేన్,ఫోర్ లేన్, 6లేన్ రోడ్లు ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నామని అన్నారు.
కొలిక్కి రానున్న హ్యామ్ రోడ్లు
హ్యామ్ రోడ్లు రూ.11,399 కోట్లతో త్వరలో కొలిక్కి రానుందని ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా మాట్లాడతా అన్నారు. రానున్న రోజుల్లో రీజినల్ రింగ్ రోడ్డు కు సమాంతరంగా రూరల్ రోడ్లు డెవలప్మెంట్ చేయాలని తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు వచ్చి,ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. మంచి రోడ్లు ఉన్నప్పుడే ఇది సాధ్యమని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లమన్నారు. గ్లోబల్ సమ్మిట్ వేదికగా చరిత్రలో ఎన్నడు లేని విధంగా మొదటి సారి ఆర్ అండ్ బి రోడ్ పాలసీని ఆవిష్కరించుకున్నామని తెలిపారు. శాఖ విజన్ కు నిదర్శనమన్నారు. మన్ననూరు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్,గ్రీన్ ఫీల్డ్ హైవేలు,ఎన్నో గొప్ప కార్యక్రమాలతో ఆర్ అండ్ బి ముందుకు సాగుతోందనీ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో అతిపెద్ద డిపార్ట్మెంట్ ఆర్ అండ్ బి అని కొనియాడారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో తనకు ఉన్న పరిచయంతో 2ఏళ్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా 2వేల కోట్ల సీఆర్ ఐఎఫ్ నిధులు తెచ్చామని చెప్పారు. నూతన ప్రాజెక్టులతో అభివృద్ది పథాన సాగుదాం..మీరు కష్టపడి పనిచేయండి..మంచి పేరు తీసుకురండి అని ఉద్యోగులకు హితబోధ చేశారు. మీకు ఏమి కావాలన్నా ముఖ్యమంత్రిని అడిగి ఒప్పించే బాధ్యత తీసుకుంటానన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, నా హయాంలో రోడ్లు & భవనాల శాఖలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించామని గుర్తు చేశారు. ఏపీ విభజనకు సంబంధించి ఇంకా పెండింగ్‌లో ఉన్న సీనియారిటీ సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తామని, ఆ సమస్యలు పరిష్కారమైన వెంటనే, సీనియారిటీ ప్రకారం అన్ని కేడర్లలో పదోన్నతులు మంజూరవుతాయ న్నారు. అదేవిధంగా రోడ్లు & భవనాల శాఖలో ఉన్న 265 ఏఈఈలు, ఏఈ ఖాళీ పోస్టులను కూడా త్వరలో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈఎన్సి లు మోహన్ నాయక్, జయ భారతి, సి.ఈ లు రాజేశ్వర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, కిషన్ రావు, బి.వి రావు, లింగారెడ్డి, వసంత్ నాయక్, నర్సింగ్ రావు, పలువురు ఎస్ఈలు, ఈఈ లు, ఇంజనీర్లు, ఆర్ అండ్ బి ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు, ఆర్ అండ్ బి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
—————————————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం
Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా
X (Twitter),
Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర,
యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.