– రెండుచోట్లా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వాలే
– సీఎం రేవంత్ సోనియాతో మాట్లాడాలి
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23: కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచాలనుకోవడం దక్షిణ తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని బీజేపీరాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ భూసేకరణ చేపట్టడం, భవిష్యత్తులో డ్యామ్ ఎత్తును పెంచే ప్రయత్నాలు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపును ఆపకపోతే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందని రాంచందర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా నదిపై ఉన్న ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచాలనే కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు. డ్యామ్ ఎత్తు పెంచితే ఉమ్మడి జూరాల, నాగార్జునసాగర్, పాలమూరు-రంగారెడ్డి, నెట్టెంపాడు, కల్వకుర్తి వంటి ప్రాజెక్టులు వట్టిపోయి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని తెలిపారు. హైడల్ పవర్ కోసం, రైతులకు సాగు నీటి కోసం కృష్ణానదిపై ఆధారపడ్డామని, కృష్ణా నదిపై ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపుతో రైతులకు నష్టం జరుగుతుందనే కారణంతోనే గతంలో సుప్రీంకోర్టు దీనిపై స్టే ఇచ్చిందని గుర్తు చేశారు.స్టే ఉన్నప్పటికీ ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు సిద్ధమవ్వడం అన్యాయమన్నారు. కర్ణాటకలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నందున అక్కడి ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న ద్రోహాన్ని సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకలతో మాట్లాడి తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు, రైతులకు అన్యాయం జరగకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు చొరవ చూపడం లేదు అని రామచందర్‌రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ ఆస్కార్ అవార్డు ఇచ్చిందని చెప్పారు కదా.. మరి అంత పలుకుబడి, ప్రాధాన్యత, చొరవ ఉన్నందున రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆమె వద్ద ఎందుకు నోరుమెదపడం లేదు? పాలమూరు బిడ్డ అని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి పాలమూరుకు నీరు ఆగిపోతే ఎందుకు నోరు మూసుకుంటున్నారు అని నిలదీశారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు చర్యలు సుప్రీంకోర్టులో కేసు ఉన్న సందర్భంలో చేయకూడదని సీడబ్ల్యూసీ కూడా చెప్పిందంటూ ఇప్పటికైనా తెలంగాణ రైతులకు నష్టం కలగకుండా కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరపాలని రామచందర్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





