ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలంగాణ నోట్లో మన్నే

– తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినడం ఖాయం
– కర్ణాటక కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తీరుపై మాట్లాడని రేవంత్‌
-‌ మండిపడ్డ బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబరు19: కర్ణాటక కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి దిల్లీలో జల్సాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కె.తారక రామారావు మండిపడ్డారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచాలని మూడు రోజుల కిందట కర్ణాటక మంత్రిమండలి నిర్ణయం తీసుకుంటే దున్నపోతు మీద వాన పడ్డట్టు రేవంత్‌ ‌రెడ్డి వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు. కేవలం 100 టిఎంసీల కోసమే ఆల్మట్టి ఎత్తు పెంచడం లేదన్న కేటీఆర్‌.. కృష్ణా జలాల్లోని తెలంగాణ హక్కును బొందపెట్టి ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌, ‌నల్గొండ, రంగారెడ్డిలను ఎడారిగా మార్చేందుకు కర్నాటక కాంగ్రెస్‌ ‌కుట్ర పన్నిందని ఆరోపించారు. అక్కడా కాంగ్రెస్సే, ఇక్కడా కాంగ్రెస్సే అయినా మాట్లాడే దమ్ము, తెలంగాణ రైతుల పొట్టగొడుతుంటే ఆపే ధైర్యం లేవా అని రేవంత్‌ ‌ను నిలదీశారు. ఈ కుట్రపై ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. జాతీయ పార్టీకి జాతీయ విధానం ఉండాలని, కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని, ఇక్కడి రైతులను బలిస్తారా అని ప్రశ్నించారు. కర్నాటక ప్రభుత్వ కుట్రను వెంటనే అడ్డుకోకపోతే రైతులతో కలిసి మహోద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరించారు. కేసీఆర్‌ ‌హయాంలో 90 శాతం పనులు పూర్తైన పాలమూరు రంగారెడ్డి పథకం నిర్వీర్యం అవుతుంటే పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్‌ ‌చూస్తూ ఊరుకోవడం దారుణమన్నారు. కర్నాటక నుంచి కృష్ణా నీళ్లు రాకపోతే జూరాలే నిండదన్న కేటీఆర్‌.. ‌రేవంత్‌ ‌మొదలుపెట్టిన నారాయణపేట కొడంగల్‌ ఎత్తిపోతల పథకం కూడా పడావు పడుతుందన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంపు ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ‌చేసిన అవినీతి ఆరోపణలను కేటీఆర్‌ ‌తిప్పికొట్టారు. కేవలం ఐదు అడుగుల ఎత్తు పెంచేందుకు అవసరమైన భూసేకరణ కోసమే 70 వేల కోట్లు ఖర్చు చేయడంతో పాటు లక్షా 30 వేల ఎకరాలను భూమిని సేకరిస్తున్నామని కర్ణాటక ప్రభుత్వం చెపుతుందన్నారు. మరి 5 అడుగుల భూసేకరణకే అంత ఖర్చయితే, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్‌ ‌స్టేషన్లు, 21 పంపింగ్‌ ‌స్టేషన్లు, 203 కిలోటర్ల టన్నెల్స్, 1700 ‌కి.మీ కాలువలు.. 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు 93 వేల కోట్ల ఖర్చు చేయడంలో తప్పేం ఉందన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆరు దశాబ్దాల పాటు జరిగిన అన్యాయాన్ని సరిచేసిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ జీవధార అని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. తెలంగాణకు కల్పతరువు, కామధేనువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ ‌నేతలు చేసింది చిల్లర,డొల్ల, దుర్మార్గ ప్రచారమే అన్న సత్యాన్ని తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా తెలుసుకోవాలని కేటీఆర్‌ ‌విజ్ఞప్తి చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంపు అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌ ‌లో ఉందని కేటీఆర్‌ ‌గుర్తుచేశారు. 2013లో ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం, కృష్ణా వాటర్‌ ‌డిస్ప్యూట్స్ ‌ట్రిబ్యునల్‌- 2 ఇచ్చిన అనుమతిపై సుప్రీంకోర్టులో స్పెషల్‌ ‌లీవ్‌ ‌పిటిషన్‌ ‌వేసిందన్నారు. . ఎత్తు పెంపుతో మన రైతాంగ హక్కులు దెబ్బతింటాయని వాదించి స్టే తెచ్చిందని తెలిపారు. 2014లో తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కూడా ఈ పోరాటాన్ని కొనసాగించి సుప్రీంకోర్టులో స్పెషల్‌ ‌లీవ్‌ ‌పిటిషన్‌ ‌వేసి ఆ స్టే కొనసాగేలా చేశారని గుర్తుచేశారు. సుప్రీంకోర్టులో పెండింగ్‌ లో ఉండగానే కర్ణాటక సర్కారు ఇంత దుర్మార్గమైన నిర్ణయం తీసుకుంటే తెలంగాణ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడం లేదని కేటీఆర్‌ ‌నిలదీశారు.కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ ‌వెంటనే స్పందించి సుప్రీంకోర్టుకు వెళ్తామని ప్రకటించారని, కానీ రేవంత్‌ ‌మాత్రం ఇంకా మొద్దు నిద్ర వీడలేదని కేటీఆర్‌ ‌విమర్శించారు. మహారాష్ట్ర మద్దతు కూడగట్టుకుని సుప్రీంలో పోరాడాల్సిన బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రిపై ఉందన్న కేటీఆర్‌, ‌గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కేసీఆర్‌ ‌పక్క రాష్ట్రాల సిఎంలతో స్వయంగా మాట్లాడి, అభ్యంతరాలను తొలగించి ప్రాజెక్టును పూర్తిచేశారని చెప్పారు. అయితే తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలన్న చిత్తశుద్ధి రేవంత్‌ ‌కు లేకపోవడం ఇక్కడి ప్రజల దురదృష్టం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును బలిపెట్టి గోదావరి జలాలను ఏపీకి ధారాధత్తం చేస్తున్న ఇప్పుడు కృష్ణా జలాలను కర్ణాటకకు దోచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. రాష్ట్రంలోని రెండు జీవనదులపై తెలంగాణ రైతుల హక్కులను కాలరాస్తున్న ఈ దుర్మార్గ జలదోపిడీకి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేయడంత పాటు రైతులతో కలిసి బీఆర్‌ఎస్‌ ‌మహోద్యమాన్ని నిర్మిస్తుందని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *