– ‘హిల్ట్’ పాలసీపై సందేహాలను నివృత్తి చేయాల్సిందే
– బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: హిల్ట్ పాలసీపై తాము లేవనెత్తిన చాలా అంశాలకు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమాధానాలు చెప్పకుండా దాటవేయడం ముమ్మాటికీ బాధ్యతారాహిత్యమేనని బీజేఎల్పీ నేత అల్లేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు, పర్యావరణవేత్తలు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేయకుండా ప్రభుత్వం ఇష్టానుసారంగా పరిశ్రమల భూములను అడ్డికి పావుశేరు మాదిరిగా అగ్గువకే కన్వర్షన్ చేయడం ముమ్మాటికీ ల్యాండ్ లూటీయే అని విమర్శించారు. హైదరాబాద్‌లోని 22 పారిశ్రామికవాడల్లోని భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం లీజుకు ఇచ్చినవి ఎన్ని ఎకరాలు, ఇండస్ట్రియలిస్టులు అప్పటి ఐఐసీ ధరల ప్రకారం కొనుగోలు చేసినవి ఎన్ని ఎకరాలు, ఈ పరిశ్రమల్లో కాలుష్యకారకమైనవి ఎన్ని ఉన్నాయి, వాటి వల్ల ఎలాంటి దుష్పరిణామాలు సంభవిస్తున్నాయనే అంశంపై పర్యావరణ నిపుణుల నివేదిక ఏమైనా ప్రభుత్వం వద్ద ఉందా అని ప్రశ్నించారు. ఎన్విరాన్‌మెంటల్ స్టడీ ఏమైనా చేశారా, ఏ ప్రాతిపదికన ఈ పరిశ్రమలన్నీ కాలుష్యకారకాలని ప్రభుత్వం నిర్ధారించిందిదో తెలపాలని నిలదీశారు. కేస్ టు కేస్ కన్వర్షన్ అంటే అన్ని పరిశ్రమలు తరలించే యోచన ఉందా లేదా తరలించని పరిశ్రమల పక్కన హౌసింగ్ కాలనీలు ఎలా నిర్మిస్తారు.. తరలిపోయే పరిశ్రమలకు స్థలాలు ఎక్కడ చూపించారు.. ఇలా అన్ని రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ కన్వర్షన్ చేస్తే మళ్ళీ వారు ఇండస్ట్రీ నిర్మిస్తారా అని ప్రభుత్వానికి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నలు సంధించారు. మరి పరిశ్రమల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుమతివ్వడం సమంజసమేనా, కాలుష్యకారక భూముల్లో అపార్టుమెంట్ల నిర్మాణం జరిగితే అక్కడ నివసించబోయే ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే ప్రమాదం లేదా? ఏవైనా కంపెనీలు తాము ఓఆర్‌ఆర్ ఆవలకు తరలించలేమంటే వారికి మినహాయింపును ఇస్తారా.. అలా ఇచ్చినట్టయితే కాలుష్యం పెరిగిపోదా అనేవాటిపై ప్రభుత్వం సమాధానాలు చెప్పాలన్నారు. పరిశ్రమల ప్రోత్సాహం కోసం ఇచ్చిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుమతిచ్చిన తర్వాత ఆ ఇండస్ట్రియలిస్టులు మళ్లీ ఓఆర్‌ఆర్ ఆవల భూములను కొనుగోలు చేసి పరిశ్రమలను ఏర్పాటు చేస్తారనే గ్యారంటీ ఏంటి అని అడిగారు. హిల్ట్ పాలసీ వల్ల ఉన్న పరిశ్రమలు అంతరిస్తాయే తప్ప కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయో ప్రభుత్వ పెద్దలు సెలవివ్వాలన్నారు. మనుగడలో ఉన్న పరిశ్రమలు మూతపడితే వాటిలో పనిచేస్తున్న సిబ్బంది ఉద్యోగాలు కోల్పోతారు కదా.. మరి ఇది నిరుద్యోగ సమస్యను పెంచడమే కాదా అంటూ వారి సమస్యలను ఎలా పరిష్కరిస్తారుని అడిగారు. బీఆర్‌ఎస్ హయాంలో గ్రిడ్ పాలసీ ద్వారా జరిగిన అక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకని బయట పెట్టడం లేదన్నారు. ఇది బీఆర్‌ఎస్, కాంగ్రెసుల మధ్య ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయం కాదా అని అడిగారు. ఇండిస్ట్రియల్ ల్యాండ్ లూటీ ఎపిసోడ్‌కు బీఆర్‌ఎస్ కిటికీలు తెరిస్తే కాంగ్రెస్ ఇపుడు తలుపులు తెరవడం కాదు, ఏకంగా గోడలనే కూల్చేస్తోందన్నమాట. బీఆర్‌ఎస్ అవినీతి బాటలో కాంగ్రెస్ సర్కారు నడుస్తోందని బిబీజేపీ ఎండగడుతుంటే మంత్రి శ్రీధర్‌బాబు బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ సర్కారును అడ్డుకుంటున్నాయంటూ తన రాజకీయ తెలివితేట లుపయోగించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పాలసీపై వివరణ ఇవ్వకుండా చిల్లర ఆరోపణ చేయడం శ్రీధర్‌బాబు దివాలాకోరుతనానికి నిదర్శనం అని అల్లేటి విమర్శించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





