– నాలుగో ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం
– ఉ్రగవాదంపై ఉక్కుపాదం
– పహల్గాం ప్రతీకారదాడితో వెల్లడైన భారత్ సత్తా
– ఎన్‌డీఏ 11ఏళ్ల పాలనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలోని అన్నిరంగాల్లో సమాన అభివృద్ధికి బాటలు పడ్డాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు శ్రీ జి.కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానిగా నరేంద్రమోదీ 11ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా మంగళవారం విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. మోదీ హయాంలోనే దేశం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందబోతున్నదన్నారు. అన్ని రాష్ట్రాల అనుమతితో జీఎస్టీని అమల్లోకి తెచ్చింన్నారు.పీఎం కిసాన్ పథకం ప్రారంభించినప్పటి నుంచి 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.3.7 లక్షల కోట్లు నేరుగా వారి ఖాతాల్లో ప్రభుత్వం జమచేసిందన్నారు. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంలోకి వెళ్లి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి మన వాయుసేన శక్తియుక్తులను ప్రపంచానికి చాటిచెప్పామన్నారు. పీఎం శ్రీ కింద దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలను అద్భుతంగా తీర్చి దిద్దుతున్నామన్నారు.
ఖేలో ఇండియాలో భాగంగా 1,048 సంస్థల ద్వారా యువత అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు పలు క్రీడల్లో మెరుగైన శిక్షణ అందిస్తున్నామని గుర్తుచేశారు. 2014 లో దేశవ్యాప్తంగా 91 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండగా, 2024 నాటికి ఇది 1.46 కోట్ల కిలోమీటర్లకు పెరిగిందన్నారు. రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేయడంతో మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్) పెరిగింది.దీని ఫలితంగా.. 2014లో రూ.29,055 కోట్లుగా ఉన్న రైల్వే మూలధన వ్యయం.. 2024లో రూ.2లక్షల 42వేల కోట్లకు పెరిగిందన్నారు. ఆడపిల్లల సంఖ్యను పెంచి వారికి విద్యను చేరువ చేయాలనే సంకల్పంతో ‘బేటీ బచావో-బేటీ పఢావో’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నాం. ట్రిపుల్ తలాఖ్ రద్దుతో ముస్లిం మహిళల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చాం.ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 7 కోట్ల మందికి పైగా మహిళా లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేశామన్నారు.
దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన ద్వారా.. దేశవ్యాప్తంగా విద్యుదీకరణ 100% పూర్తయిందన్నారు. ప్రధానమంత్రి మోదీ చొరవతో.. భారతీయ ప్రాచీన జ్ఞాన సంపద అయిన ‘యోగా’కు అంతర్జాతీయ గుర్తింపు లభించిందన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని మోదీ ప్రభుత్వం మన భీమవరం వేదికగా ఘనంగా నిర్వహించిందని గుర్తుచేశారు. తెలుగు ప్రజల అభిమాన గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి శతజయంతి ఉత్సవాలను కూడా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందన్నారు.
ఆయన స్మృతి చిహ్నంగా.. హైదరాబాద్ లోని సీసీఆర్‌టీలో ఘంటసాల ఆడిటోరియాన్ని నిర్మిస్తోందన్నారు. మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు గారికి మోదీ ప్రభుత్వం మాత్రం ‘భారతరత్న’ అవార్డును ఇచ్చి గౌరవించిందన్నారు. మన తెలుగువారు ఎప్పటికీ గుర్తుంచుకునే.. శ్రీ రామోజీ రావు, వెంకయ్య నాయుడు , చిరంజీవి, డాక్టర్ నాగేశ్వర రెడ్డి , గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, పద్మవిభూషణ్ అవార్డుతో గౌరవించుకున్నాం. మరెందరో తెలుగు మట్టిలో మాణిక్యాలకు ‘పద్మశ్రీ’, ‘పద్మ భూషణ్’ అవార్డులను కూడా ఎన్డీయే ప్రభుత్వం అందించిందని గుర్తుచేశారు.





