– అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ కే ప్రజల మద్దతు
– విపక్షాలు అభివృద్ధిక అడ్డం పడుతున్నాయి
– మంత్రి పొన్నంతో కలసి మీడియా సమావేశంలో మంత్రి తుమ్మల
సిద్దిపేట, ప్రజాంత్ర, ఫిబ్రవరి 7: పంచాయతీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని, మెజార్టీ సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండేళ్లుగా అసాధ్యమని భావించిన ఎన్నో సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరించిందని స్పష్టం చేశారు. అసూయతోనే ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, ప్రజలు వారిని ఎప్పుడో తిరస్కరించారని ఆయన ఎద్దేవా చేశారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో తుమ్మల ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక నిర్ణయాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీ కులగణన చేపట్టిన ఘనత తమ ప్రభుత్వానిదేనని గర్వంగా ప్రకటించారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకునే నేడు కేంద్ర ప్రభుత్వం కూడా తలవంచి కులగణన చేపట్టబోతోందని ఆయన పేర్కొన్నారు. అలాగే ఎస్సీ వర్గీకరణ విషయంలో దశాబ్దాల నాటి కల సాకారం చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 13,000 కోట్లు వెచ్చించి పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణెళ్లినని ఆయన వెల్లడించారు. గత పదేళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన వారే నేడు నీతులు మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రైతాంగం, పేదలు, నిరుద్యోగులు సంతోషంగా ఉంటే ఓర్వలేక ప్రతిపక్షాలు కారుకూతలు కూస్తున్నాయి. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్, పంచాయతీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పని అయిపోయిందని ప్రచారం చేశారు, కానీ ప్రజలు తమ. వోటుతో మమ్మల్ని ఆశీర్వదించి వారికి బుద్ధి చెప్పారు’ అని తుమ్మల గుర్తు చేశారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో ప్రతిపక్షాల విమర్శలకు ప్రజలు సమాధానం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో సహకరించకపోయినప్పటికీ అవసరమైతే తల తాకట్టు పెట్టయినా సరే అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల తేల్చి చెప్పారు. తాము చేసే పనులే తమకు రక్ష అని, కాంగ్రెస్ పార్టీ ఎవరి విమర్శలకూ బెదరదని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో 100 శాతం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోందని ఆయన జోస్యం చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





