– ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: డిజిటల్ యుగంలోనూ ఆకాశవాణి వార్తలు తమకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయని ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్‌కుమార్ జైన్ అన్నారు. సంప్రదాయ రేడియో వార్తా ప్రసారంతోపాటు సోషల్ మీడియాలోనూ ప్రత్యేకత చాటుకుంటున్నదని చెప్పారు. ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో కవాడీగూడలో పార్ట్‌టైమ్ కరస్పాండెంట్స్, క్యాజువల్ న్యూస్ ఎడిటర్స్, న్యూస్ రీడర్లకు మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ఆకాశవాణి తన కరస్పాండెంట్లకు ఎప్పటికప్పుడు శిక్షణ తరగతులు నిర్వహిస్తూ వారి వృత్తి మెళకువలను పెంపొందిస్తున్నదని చెప్పారు. సోషల్ మీడియా ఒత్తిడితో వార్తలను తక్షణమే ప్రసారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడినా విశ్వసనీయతను పోగొట్టుకోకుండా ఆ సవాలును అధిగమించాలని కరస్పాండెంట్లకు సూచించారు. సేకరించిన సమాచారాన్ని పరిశీలించి, నిర్ధారించుకోవాల్సిన బాధ్యత కరస్పాండెంట్లపై ఉందన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం వల్ల వార్తలకు నిర్వచనమే మారిపోయిందన్నారు. ప్రభుత్వ సంస్థగా ఆకాశవాణిలో ఖచ్చితత్వం, ధర్మనిష్ఠను పాటించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. పీఐబీ హైదరాబాద్ అదనపు డైరెక్టర్ జనరల్ శృతిపాటిల్ మాట్లాడుతూ వాట్సప్ యూనివర్సిటీ ద్వారా వ్యాప్తిచెందుతున్న ఫేక్ న్యూస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో పీఐబీలో ప్రారంభించిన ఫ్యాక్ట్ చెక్ విభాగం గురించి వివరించారు. ప్రభుత్వ వార్తాహరులుగా విలేకరులు క్షేత్రస్థాయి అభివృద్ధి నివేదికలపై దృష్టి సారించాలని సూచించారు. ఆకాశవాణి హైదరాబాద్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, క్లస్టర్ హెడ్ హరిసింగ్ మాట్లాడుతూ ఆకాశవాణి విశ్వసనీయతకు, సమగ్రతకు, సంపూర్ణతకు మారుపేరు అని చెప్పారు. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని విశ్వసనీయతను పోగొట్టుకోకుండా ఆకాశవాణి ప్రఖ్యాతిని అలాగే నిలబెట్టాలని కరస్పాండెంట్లకు సూచించారు. ఆకాశవాణి హైదరాబాద్ రీజినల్ న్యూస్ యూనిట్ హెడ్, డిప్యూటీ డైరెక్టర్ ఎం.ఎస్.మహేష్ మాట్లాడుతూ 1957 ఫిబ్రవరి 7న ఆకాశవాణిలో వార్తా విభాగం ప్రారంభమైందని, ఉర్దూ శ్రోతలను దృష్టిలో ఉంచుకుని 1965లో ఉర్దూ బులెటిన్ ప్రారంభమైనట్లు గుర్తు చేశారు. ‘మారుతున్న మీడియా వాతావరణంలో వార్తల సేకరణ, కంటెంట్ తయారీ’పై ఆర్టీఐ మాజీ కమిషనర్, పీపుల్స్ పల్స్ డైరెక్టర్ ఆర్.దిలీప్ రెడ్డి అవగాహన కల్పించారు. ‘సోషల్ మీడియా యుగంలో కంటెంట్ వినియోగం’పై హిందూ బిజినెస్ లైన్ అసోసియట్ ఎడిటర్ డాక్టర్ కూర్మనాథ్, ‘న్యూస్ రూమ్ పరిణామం, కంటెంట్ బదిలీ, మారుతున్న కంటెంట్ మూలాల స్వభావం’పై ఐ న్యూస్ సీఈఓ, చీఫ్ ఎడిటర్ ఏకే సాగర్ విశ్లేషణ చేశారు. ఫ్యాక్ట్ చెక్, సోషల్ మీడియా హ్యాండిల్స్ మెరుగుపరచడానికి సోషల్ మీడియా టెక్నిక్స్ అంశంపై ఫాక్ట్ లీ సంస్థ ఆపరేషన్స్ హెడ్ భరత్ వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





