పోలీసు విధులకు క్రీడలే ప్రాణాధారం

– గవర్నర్ శివప్రతాప్ శుక్లా
– అఖిల భారత పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ ప్రారంభం

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 25: క్రీడలు కేవలం శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాక వ్యక్తిత్వ వికాసానికి, క్రమశిక్షణకు పోలీసు విధులకు ప్రాణధారమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం  ’74వ బి.ఎన్. మల్లిక్ అఖిల భారత పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ 2025–26′ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తనకు క్రీడలంటే అపారమైన ప్రేమని, గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో క్రీడల శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. భారతదేశం నలుమూలల నుంచి వచ్చిన పోలీసు సిబ్బంది తమ యూనిఫాం పక్కన పెట్టి, క్రీడా జెర్సీల్లో స్నేహాన్ని మరియు ఆరోగ్యకరమైన పోటీని జరుపుకోవడానికి ఒకచోట చేరడం అసాధారణమైన విషయమని కొనియాడారు. భవిష్యత్తులో ఈ పోటీల్లో మహిళా పోలీసుల భాగస్వామ్యం ఇంకా ఎక్కువగా ఉండాలని, వారి భాగస్వామ్యం మన బలగాలను మరింత బలోపేతం చేస్తూ అందరినీ కలుపుకొని పోయేలా చేస్తుందని ఆకాంక్షించారు. ఒక పోలీసు అధికారికి క్రీడలు కేవలం హాబీ మాత్రమే కాదని, అవి వారిని మానసికంగా చురుగ్గా ఉంచుతూ విధి నిర్వహణలోని కఠినమైన అవసరాలకు శారీరకంగా సిద్ధం చేస్తాయని వివరించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి కొత్త కార్యక్రమాలతో రాష్ట్రం ప్రపంచస్థాయి అథ్లెట్లకు కేంద్రంగా ఎదుగుతోందని ప్రశంసించిన గవర్నర్ క్రీడాకారులందరూ పూర్తి ఉత్సాహంతో, నిష్పక్షపాతంగా ఆడుతూ క్రీడాస్ఫూర్తిని నిలబెట్టాలని హితవు పలికారు. గెలుపోటముల కంటే ప్రదర్శించే అంకితభావమే ముఖ్యమని పేర్కొంటూ అందమైన భాగ్యనగరంలో క్రీడాకారులందరూ పోటీలను ఆస్వాదించాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. డీజీపీ బి.శివధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక ఛాంపియన్‌షిప్‌కు హైదరాబాద్ వేదిక కావడం తమకు అత్యంత ఆనందంగా, గర్వంగా ఉందన్నారు. గవర్నర్ రాక ఈ కార్యక్రమ వైభవాన్ని పెంచడమే కాకుండా యువ ప్రతిభకు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. పోలీస్ సేవలో క్రీడలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన్నారు.ఫుట్‌బాల్ క్రీడలో ప్రతిబింబించే జట్టుకృషి, వ్యూహం, ఓర్పు, త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం, సహచరులపై నమ్మకం వంటి లక్షణాలు ప్రతి పోలీసు అధికారికి అవసరమని వివరించారు. ఈ ఛాంపియన్‌షిప్ కేవలం పోటీ మాత్రమే కాదని, దేశవ్యాప్త పోలీసు బలగాల మధ్య పరస్పర సహకారం, స్నేహం, ఐక్యతకు ఒక వేడుక అని అభివర్ణించారు. మనం వేర్వేరు రాష్ట్రాల్లో పనిచేస్తున్నప్పటికీ దేశ పౌరులను రక్షించడం, చట్టాన్ని నిలబెట్టడం మరియు శాంతిభద్రతలను కాపాడటమే మన అందరి ఏకైక లక్ష్యమని, ఇటువంటి వేదికలు గుర్తు చేస్తాయని గుర్తుచేశారు. క్రీడాకారులు తమ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని గుర్తుంచుకోవాలని, నిజాయితీతో కూడిన నిష్పక్షపాత పోటీని ప్రదర్శించాలని కోరారు. ఈ మెగా ఈవెంట్ నిర్వహణకు అవిశ్రాంతంగా కృషి చేసిన సిబ్బందిని అభినందిస్తూ ఉత్తమ జట్టు విజయం సాధించాలని ఆశిస్తూ ప్రసంగాన్ని ముగించారు. ఇన్స్పెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ (స్పోర్ట్స్) గజరావు భూపాల్ స్వాగతోపన్యాసం చేస్తూ రాష్ట్రంలో గతంలో ఫుట్‌బాల్ క్రీడకు చాలా ఆదరణ ఉండేదని పోలీస్ శాఖకు చెందిన పలువురు క్రీడాకారులు ఫుట్‌బాల్ లో ప్రపంచవ్యాప్తంగా రాణించారని గుర్తు చేశారు. హైదరాబాద్ లోని ఐదు గ్రౌండ్లలో ఫుట్బాల్ మ్యాచ్ లు కొనసాగుతాయని పేర్కొన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గవర్నర్, డిజిపి, తదితరులకు కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో ఉత్తరప్రదేశ్ క్రీడా శాఖ మంత్రిగా వ్యవహరించిన గవర్నర్ ఛాంపియన్షిప్ కు ప్రారంభోత్సవం చేయడం పట్ల ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. వివిధ రాష్ట్రాల ఫుట్బాల్ జట్ల మార్క్స్ పాస్ట్ అనంతరం ప్రారంభోత్సవ కార్యక్రమ సందర్భంగా నిర్వహించిన ప్రారంభ మ్యాచ్ ను గవర్నర్ డిజిపి తదితరులు కొద్దిసేపు వీక్షించారు. ఆర్ బివిఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, అడిషనల్ డిజిపిలు సంజయ్ కుమార్ జైన్, అనిల్ కుమార్, డిఐజి అభిషేక్ మహంతి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *