– మౌలిక వసతులతో పాటు..బ్రేక్‌ఫాస్ట్
- విజయ డెయిరీ ద్వారా అవసరమైన పాల సరఫరా
– రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం
– ప్రైవేట్ స్కూళ్ల ఫీజులకు కళ్లెం వేసేలా చర్యలు
– విద్యారంగంపై సమీక్షలో సిఎం రేవంత్ కీలక ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26: కోర్ అర్బన్ రీజియన్‌లో ప్రభుత్వ స్కూల్స్‌లో మౌలిక సదుపాయాల కల్పనపైన దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. భారతీయ విద్యా భవన్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూళ్లల్లో ఉన్న మౌలిక సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఉండాలని సూచించారు. గురువారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌పైన సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళీ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణా రెడ్డి , విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా , కళాశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్, అంబేద్కర్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని మార్గనిర్దేశం చేశారు. బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌లో తప్పనిసరిగా పాలు అందజేయాలని నిర్దేశిరచారు. ఇందుకోసం విజయా డైరీ నుంచి పాలు సేకరించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత కోసం ఏఐ టెక్నాలజీని వినియోగించాలని దిశానిర్దేశం చేశారు. కోర్ అర్బన్ రీజియన్ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక్కొక మండలంలో ఆరుట్ల స్కూల్ తరహాలో ట్రాన్స్‌పోర్ట్‌తో సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ట్రాన్స్‌పోర్ట్ కోసం ఎలక్టిక్రల్ బస్సుల ఏర్పాటు పైన అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రైవేట్ స్కూల్స్‌లో నిబంధనలకు మించి ఫీజులు వసూలు చేస్తే అనుమతి రద్దుతో పాటు రికవరీ చేసేలా నిబంధన విధించాలని హుకుం జారీ చేశారు. ప్రైవేట్ స్కూల్స్‌లో ఫీజుల నియంత్రణకు సంబంధించి రికమండేషన్స్‌ని ప్రజాభిప్రాయం కోసం వెబ్‌సైట్‌లో ఉంచాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





