స్వాతంత్ర వేడుకల్లో హైకోర్టు చీఫ్ జస్టిస్
కోర్టులకొచ్చే కక్షిదారులకు సత్వర, సమర్థ న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ చెప్పారు. వేగంగా న్యాయం అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. దేశ స్వాతంత్రం కోసం ఎంతో మది మహానుభావులు త్యాగాలు చేశారని కొనియాడారు. ఆ త్యాగధనులకు అందరం కృతజ్ఞతలు తెలపాలన్నారు. రాజ్యాంగ విలువలు, సూత్రాలను కాపాడాలని సూచించారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైకోర్టు ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని సీజే ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘దేశాన్ని సార్వభౌమ, సోషలిస్ట్, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఏర్పాటుకు, సంరక్షణ, బలోపేతానికి సమరయోధులు ఎంతో కృషి చేశారు. మారుతున్న ప్రపంచంలో ప్రతి పౌరుడు అన్ని పరిస్థితుల్లోనూ దాన్ని బాధ్యతాయుతంగా కాపాడుకోవాలి. సామాజిక, ఆర్థిక, శాస్త్రీయ సహా ప్రతి రంగంలో సమష్టి కృషితోనే దేశం బలమైన శక్తిగా అవతరించింది. రాష్ట్ర హైకోర్టు ఎందురో న్యాయమూర్తులను, సమర్థులైన న్యాయవాదులు తయారు చేసింది. హైకోర్టు, జిల్లా కోర్టుల జడ్జిలు అనేక అడ్డంకులున్నా న్యాయం అందిస్తూ కేసుల పెండింగ్‌ను తగ్గించడంలో అవిశ్రాతంగా కృషి చేస్తున్నారు. గత సంవత్సర కాలంలో 210 పని దినాలకు 74,768 కేసులు నమోదు కాగా, 72,414 కేసులు పరిష్కారమయ్యాయి. బార్, బెంచ్ సమష్టి కృషి కేసుల గుణాత్మక, వేగవంతమైన పరిష్కారానికి దోహదం చేస్తోంది’ అని వెల్లడించారు.



