– రాష్ట్రంలో సరిపడ ఇంధన నిల్వలు
– కొరత అంటూ ఆందోళన చెందనవసరం లేదు
– ప్రజలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజి కొరత ఉత్పన్నమయ్యే ప్రసక్తే లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానంగా హైదరాబాద్‌లో డీజిల్, పెట్రోల్ బంక్‌ల వద్ద పెద్ద ఎత్తున ఉన్న క్యూలను చూసి పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజి కొరత అంటూ జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ వదంతులతో ప్రజలు గందరగోళంలో పడవద్దని విజ్ఞప్తి చేశారు. శాసనసభ ప్రాంగణంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు నెలలకు సరిపడ నిల్వలు ఉన్నాయన్నారు. ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ కంపెనీలు ఇంధన సరఫరాలను గణనీయంగా పెంచాయంటూ డిమాండ్‌ని మించి సరఫరా కొనసాగుతోందని తెలిపారు. బుధవారం 17,246 కిలోలీటర్ల డిమాండ్ ఉండగా 17,898 కిలోలీటర్ల సరఫరా జరగడమే నిదర్శనమన్నారు. అంటే 652 కిలో లీటర్ల అదనపు సరఫరా జరిగిందన్నారు. దీనికితోడు అదనంగా 16,000 కిలోలీటర్ల ఇంధనం నిల్వ ఉంచడంతోపాటు 1200 అదనపు ట్యాంకర్లను వినియోగిస్తున్నామని మంత్రి తెలిపారు. వినియోగదారులు గందరగోళంలో పడి పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేయడంతో ఒక్కసారిగా రోజువారీ డిమాండ్ 25% పెరిగిందని, అయినా రోజువారీ సరఫరాలో సగటున పోల్చి చూసినా కూడా ఎక్కడా అంతరాయం కలగకుండా అదనంగా 22% ఇంధన వనరులు నిల్వలు ఉన్నాయని తెలిపారు. అయితే కొన్ని పెట్రోలు బంకులకు నిర్ణీత సమయానికి ట్యాంకర్లు చేరుకోనందున నో-స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయన్నారు. వాస్తవంగా ఎంతమాత్రం కొరత లేదని ఆయన పునరుద్ఘాటించారు. షికార్లు చేస్తున్న పుకార్లను నమ్మి వినియోగదారులు కంటైనర్లలో, డబ్బాలలో పెట్రోల్, డీజిల్ తీసుకెళ్లడం పూర్తిగా చట్టవ్యతిరేకమైన చర్య అని, అంతకుమించి ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. పెట్రోలియం నిల్వలు రానున్న 65 రోజులకు సరిపడా ఉన్నాయని, సరఫరాలో ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకుండా ఉండేలా నిరంతరం కొనసాగేలా ఓజీసీ లైన్‌ను విస్తరించినట్లు వెల్లడించారు. రాష్ట్ర రాజధానిలో 596 పెట్రోల్ బంకులు నిరంతరాయంగా పని చేస్తున్నాయని, హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో ఎక్కడా కొరత లేదని, అహ్మదాబాద్, సూరత్, బెంగుళూరు, ధారవాడ, బెల్గాం వంటి నగరాలలో కూడా ఇదే పరిస్థితి ఉత్పన్నమైందని చెప్పారు. ఎల్‌పిజి గ హ వినియోగ సిలిండర్ల కొరత లేదని, కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో కొంత సమస్య ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ఇదే సందర్భంలో అక్రమంగా వినియోగిస్తున్న 2,952 కమర్షియల్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ గృహ వినియోగదారులకు అవసరమైన ఎల్.పి.జి సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, ప్రజలెవరూ అయోమయానికి, ఆందోళనకు గురికావద్దని, వదంతులను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మొద్దని ప్రజలకు మంత్రి ఉత్తమ్ కుమార్ పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





