– స్వలాభం కోసం వారిని ఇబ్బంది పెడితే సహించం
– దక్షిణాన ఎంత ఉందో ఉత్తరానా అలాగే ఉండాలి
– సమస్యపై పోరాడతామని రైతులకు హరీష్‌రావు హామీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: త్రిబుల్ ఆర్ అలైన్‌మెంట్ ఇష్టారీతిన మార్చి తమ కడుపు కొడుతున్నారని సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలంలోని గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు తమ భూములు కోల్పోకుండా అలైన్‌మెంట్‌లో మార్పులు చేసేలా తమ పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయాలని, పాత అలైన్‌మెంట్‌ను కొనసాగించేలా ఒత్తిడి తేవాలని మాజీ మంత్రి హరీష్‌రావుకు తమ గోడువెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు భూములు కోల్పోకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన రైతులకు హామీ ఇచ్చారు. ఉత్తర భాగాన అలైన్‌మెంట్ మార్పు వల్ల కొండాపూర్ మండలంలోని గిరిమాపూర్, తుమ్మరపల్లి, అలియాబాద్, మారేపల్లి, రాంపూర్ తాండ, గోటిలగుట్ట తండా, మాచేపల్లి తండా, శివన్నగూడెం, గంగారం గ్రామాలు తీవ్రంగా నష్టపోతున్నాయన్నరు. ఈ గ్రామాల్లో ఎక్కువగా ఉన్నది ఎస్టీ, ఎస్సీ, బీసీ రైతులేనని, అలైన్‌మెంటు మార్పుతో ఈ రైతులే తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. రైతులు భూములు కోల్పోకుండా త్రిబుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను బీఆర్‌ఎస్ ప్రభుత్వం గిర్మాపూర్ చేవెళ్ల మీదుగా ప్రతిపాదిస్తే రేవంత్ రెడ్డి తన స్వలాభం కోసం వికారాబాద్, పరిగి, కొడంగల్ మీదుగా అష్టవంకరలుగా తిప్పుతూ పచ్చటి పొలాలను మాయం చేసే కుట్రకు తెరలేపారని ఆరోపించారు. ఓఆర్‌ఆర్ నుండి త్రిబుల్ ఆర్ వరకు 40 కి.మీ దూరం ఉండాల్సి ఉండగా 23 కి.మీ దూరంలో త్రిబుల్ ఆర్‌ను ప్రభుత్వం చేపట్టిందన్నారు. గంగారం శివన్నగూడెం గ్రామంలోని పూర్తి భూమి కోల్పోయి గ్రామం మొత్తం నిర్వాసితులవుతున్నారని, ఇంతమంది రైతుల ఆవేదన రేవంత్ రెడ్డికి అర్థం అవడం లేదా అని ఆయన నిలదీశారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాంగ్రెస్ నాయకుల భూములు ఎక్కడా నష్టపోకుండా రైతుల పొలాలు మాత్రమే నష్టపోయేలా ప్రతిపాదించడం సిగ్గుచేటన్నారు. త్రిబుల్ ఆర్ ప్రాజెక్టును భవిష్యత్ అవసరాలకనుకూలంగా బీఆర్‌ఎస్ పార్టీ ప్రతిపాదించి రైతుల భూములు ఎక్కువగా నష్టపోకుండా అలైన్‌మెంటు చేస్తే రేవంత్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహర్తిస్తున్నారన్నారు. ఇది కేవలం సంగారెడ్డి నియోజకవర్గ సమస్యే కాదు.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ పరిధిలో త్రిబుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను ఓఆర్‌ఆర్ నుంచి 40 కి.మీ బదులుగా 28 కి.మీ.కు కుదించడాన్ని నిరసిస్తూ భూ నిర్వాసితులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదన్నారు. మధ్య నుండి రోడ్డు వెళ్లడం వల్ల మున్సిపాలిటీ రెండుగా విడిపోతున్నదని తెలిపారు. బాధితులు రెండు పంటలు పండిరచే పచ్చని పొలాలు, ఇండ్లు, ప్లాట్లను కోల్పోతున్నా ప్రభుత్వం కనికరించడం లేదన్నారు. హెచ్‌ఎండీఏ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ అలైన్‌మెంట్ వివరాలను యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని వివిధ మండలాల్లోని గ్రామాల్లో ఉన్న భూముల సర్వే నంబర్ల వివరాలతో ప్రచురించిందని, ఇందులో ఎక్కువగా రైతులే భూములు కోల్పోతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం వల్ల భూములు కోల్పోతున్న రైతులు అన్ని జిల్లాల్లో ఆందోళనకు దిగుతున్నారని హరీష్‌రావు తెలిపారు. పాత ఆలైన్‌మెంట్ మార్పును నిరసిస్తూ హైదరాబాద్-శ్రీశైలం హైవేపై మాలేపల్లి, పోలేపల్లి, సింగంపల్లి, సంకటోనిపల్లి రైతులు వేలాదిమంది సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగినా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని ఆయన విమర్శించారు. ‘నాడు ఫార్మా సిటీ వద్దని నేడు మాట మార్చి పచ్చటి పొలాల్లో చిచ్చు పెడుతున్నారు.. గిరిజనుల బిడ్డలను జైళ్లపాలు చేశారు.. నాడు రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు అన్నారు.. నేడు మాట మార్చి నిర్బంధాల మధ్య భూసేకరణ కొనసాగిస్తున్నారు.. భువనగిరిలో ఎన్నికల సభలో ప్రియాంక గాంధీతో ట్రిపుల్ ఆర్‌లో భూములు కోల్పోయిన రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పించారు.. కానీ అధికారంలోకి రాగానే బాధితుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారు.. పదేపదే అలైన్‌మెంట్ మారుస్తుండటంతో కేంద్రం ట్రిపుల్ ఆర్‌ను తిరస్కరించే పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి త్రిపుల్ ఆర్ ప్రాజెక్టుపై రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయండి.. లేదంటే బాధితుల ఆగ్రహానికి గురికాక తప్పదు..’ అని హరీష్‌రావు హెచ్చరించారు. త్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మారుస్తున్న తతంగంపై వెంటనే విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




