వర్గాలు, వర్ణాలతో ప్రజల్ని చీల్చే ప్రయత్నం

– అలాంటి అవకాశాలకు భారత్‌లో తావులేదు
– అందరూ కలిసి ఉండాలన్నదే ‘అలయ్‌ బలయ్‌’ ఉద్దేశం
– మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

– అలయ్‌ బలయ్‌ తెలంగాణ ఆత్మ : దత్తాత్రేయ 

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3: కులం, మతం, వర్ణం, వర్గం, జాతి పేరుతో కొందరు ప్రజల్ని చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇలాంటివాటికి మన దేశంలో తావులేదని, అలాంటి ప్రయత్నాలు చేసేవారు నిరాశ చెందక తప్పదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హరియాణా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో నాంపలి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో శుక్రవారం నిర్వహించిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈసారి మాత్రం ఆపరేషన్‌ సిందూర్‌ థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా పలువరు ప్రముఖులను దత్తాత్రేయ సత్కరించారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ 20 ఏళ్లుగా దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడాన్ని కొనియాడారు. చిన్నచిన్న విభేదాలున్నా భారతీయులం అనే భావనతో అందరూ కలిసి వెళ్తుంటారన్నారు. ఈ కార్యక్రమంతో ఐక్యతా సందేశాన్ని అందించడం సంతోషకరమని అంటూ దత్తాత్రేయ, విజయలక్ష్మిలను వెంకయ్య అభినందించారు.

అలయ్‌ బలయ్‌ తెలంగాణ ఆత్మ : దత్తాత్రేయ

అలయ్‌ బలయ్‌ ఒక సంప్రదాయం మాత్రమే కాదు.. అని ఈ కార్యక్రమం నిర్వాహకులు, హర్యానా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అభివర్ణించారు. స్వదేశీ భావనతో ముందుకు వెళ్లాలని ప్రజలకు, సేంద్రీయ వ్యవసాయం వైపు అడుగులు వేయాలంటూ రైతులకు పిలుపునిచ్చారు. తెలంగాణ చరిత్రలో ప్రతీ మార్పులో యువత కీలక పాత్ర పోషించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బండారు దత్తాత్రేయ సూచించారు.

ఐక్యతకు ఉపయోగపడే కార్యక్రమం : జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

అలయ్‌ బలయ్‌ వంటి కార్యక్రమాలతో ప్రజలకు సంస్కృతి, సంప్రదాయాలు తెలుస్తాయని, ఐక్యతకు ఉపయోగపడతాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన దత్తాత్రేయ, విజయలక్ష్మిలను ఆయన అభినందించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ దత్తాత్రేయ అజాత శత్రువని, ప్రతి ఒక్కరూ ఆయన్ను ప్రేమిస్తారని చెప్పారు.

పరిపాలన సౌలభ్యం కోసమే రాష్ట్రాల విభజన: కిషన్‌రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసమే రాష్ట్రాల విభజన జరిగినట్లు పేర్కొన్నారు. ప్రాంతాలకతీతంగా కలిసికట్టుగా ఉండాలంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు పిలుపునిచ్చారు. యువత సనాతన ధర్మం వైపు చూస్తున్నదన్నారు. మనకు దసరాతోపాటు జీఎస్టీ పండగ వచ్చిందంటూ ధరలు తగ్గించి ప్రధాని మోదీ రికార్డు సృష్టించారని చెప్పారు. బయట రాజకీయ నేతలు ఛాలెంజ్‌లు విసురుకుంటుంటారు.. కానీ పండగపూట ఒకే వేదికపైకి తీసుకొచ్చి అందరూ కలుసుకునే విధంగా ఏర్పాటు చేసిన కార్యక్రమమే అలయ్‌ బలయ్‌ అని వివరించారు.

కార్యక్రమం కొత్తగా అనిపిస్తోంది

అలయ్‌ బలయ్‌ కార్యక్రమం తమకెంతో విశ్వాసం కలిగిస్తోందని నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. ఇలాంటి సత్కారం తనకు మొదటిసారి అని, చాలా కొత్తగా ఉందంటూ దత్తాఏయకు ధన్యవాదాలు తెలిపారు. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ అలయ్‌ బలయ్‌ అంటే ఒకరినొకరు హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకుని ప్రేమను పంచుకోవడం అని చెప్పారు. శాంతి, ప్రేమ కరవైపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అవసరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, కేంద్ర మంత్రులు మనోహర్‌లాల్‌ కట్టర్‌, అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, జయంతి చౌదరి, బండి సంజయ్‌, భూపతిరాజు శ్రీనివాస వర్మ, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు, బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌, బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, సీపీఐ నేత నారాయణ, ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మాజీ ఎంపీ వి.హనుమంతావు, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ , రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు విహెచ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *