– పిల్లలకు వడ్డించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
– వికసిత్ భారత్ కోసం కృషిచేస్తున్న సంస్థ
– 23.5లక్షల పిల్లలకు పోషకాహారం అందిస్తున్న సంస్థ
– కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రదాన్
న్యూ దిల్లీ, మార్చి 17: అక్షయపాత్ర ఫౌండేషన్ తన 25 ఏళ్ల సేవా కాలంలో ఇప్పటివరకు 5 బిలియన్ భోజనాలు అందించి సరికొత్త మైలురాయిని దాటింది. న్యూ ఢిల్లీలోని రాష్టప్రతి భవన్ కల్చరల్ సెంటర్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ “విద్యా లక్ష్యాల పురోగతికి తోడ్పడుతూ 500 కోట్ల భోజనాలను అందించడం అక్షయ పాత్ర ఫౌండేషన్ సాధించిన గొప్ప విజయమన్నారు. ఈ కార్యక్రమం థీమ్ ‘సుపోషిత – సుశిక్షిత భారతదేశం నుండి వికసిత భారతదేశం వరకు’ అనే భావన, 2047 నాటికి ‘వికసిత్ భారత్’ నిర్మాణం కోసం పోషిత- విద్యావంతమైన సమాజం ప్రాముఖ్యతను తెలియజేస్తోందన్నారు. మన పిల్లలకు సురక్షితమైన మరియు ప్రకాశవంతమైన భవిష్యత్తు కల్పించడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, మనందరి సమిష్టి బాధ్యత అన్నారు. ప్రతి పిల్లవాడికి నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, మంచి ఆరోగ్యం మరియు పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణం అందేలా చూడాలి. ఇవే పిల్లల సమగ్ర అభివృద్ధికి పునాదని గుర్తుచేశారు. గత 25 ఏళ్లుగా పాఠశాలలకు మధ్యాహ్న భోజనాలను అందిస్తూ పిల్లలలో పోషకాహార లోప సమస్యను పరిష్కరించడంలో విద్యను ప్రోత్సహించడంలో నిరంతరం పనిచేస్తున్న అక్షయ పాత్ర ఫౌండేషన్‌ను ఆమె అభినందించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ మాట్లాడుతూ, “శ్రీల ప్రభుపాదుల ప్రేరణతో ప్రారంభమైన ఈ సేవా కార్యక్రమం నేడు దేశవ్యాప్త ఉద్యమంగా మారింది. 16 రాష్ట్రాల్లో 25 వేలకుపైగా పాఠశాలల్లో 23.5 లక్షల మంది పిల్లలకు రోజూ పోషకాహారం అందించడం గొప్ప విషయం. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది” అని అన్నారు. అక్షయ పాత్ర స్థాపకుడు, చైర్మన్ మధు పండిట్ దాస సంస్థ ప్రస్థానాన్ని గుర్తుచేశారు. 25 సంవత్సరాల క్రితం ‘ఎవరూ ఆకలితో చదువును కోల్పోకూడదు’ అనే లక్ష్యంతో అక్షయ పాత్ర ప్రారంభమైంది. బెంగళూరులో ప్రారంభమైన ఈ సేవ క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించి, ప్రపంచంలోనే అతిపెద్ద పాఠశాల భోజన కార్యక్రమంగా గుర్తింపు పొందిందన్నారు. 2012లో 1 బిలియన్ , 2016లో 2 బిలియన్, 2019లో 3 బిలియన్, 2024లో 4 బిలియన్ భోజనాల మైలురాళ్లను చేరుకుందన్నారు. కాగా మంగళవారం రాష్ట్రపతి చేతుల మీదుగా 5బిలియన్ల భోజనాల మైలురాయిని దాటడం విశేషమన్నారు. మధు పండిత దాస మాట్లాడుతూ, “రాష్ట్రపతి సమక్షంలో ఈ మైలురాయిని జరుపుకోవడం గర్వకారణం. ఎవ్వరూ ఆకలితో ఉండకూడదనే శ్రీల ప్రభుపాదుల దృష్టిని సాకారం చేయడంలో మేము కట్టుబడి ఉన్నాం. ఈ కార్యక్రమం మా సేవలను మరింత విస్తరించడానికి ప్రేరణనిచ్చింది” అన్నారు. వైస్ ఛైర్మన్ చంచలపతి దాస మాట్లాడుతూ, “25 ఏళ్ల ప్రయాణంలో 5 బిలియన్ భోజనాల మైలురాయిని చేరుకోవడం ఆనందదాయకం. ప్రభుత్వాలు, దాతలు, భాగస్వాముల సహకారంతో ఈ సేవలు కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో మరింత మంది పిల్లలకు పోషకాహారం మరియు విద్య అందించేందుకు కృషి చేస్తాం” అని తెలిపారు. తెలంగాణ అధ్యక్షుడు సత్య గౌర చంద్ర దాస కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. “వికసిత భారత్ కోసం సుపోషిత మరియు సుశిక్షిత భారత్” పేరిట నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి పిల్లలకు బహుమతులు అందజేసి, భోజనం వడ్డించారు. ట్రస్టీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రముఖులు, ప్రజా విధాన నిపుణులు, దాతలు, భాగస్వాములు మరియు ఇతర కీలక వ్యక్తులు పాల్గొన్నారు. అక్షయ పాత్ర పథకం లబ్ధిదారులైన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా హాజరయ్యారు.
అక్షయపాత్ర ప్రస్థానం
అక్షయపాత్ర ఫౌండేషన్ లాభాపేక్షలేని సంస్థ. ప్రభుత్వ ప్రధాన పథకం పీఎం పోషణ్‌లో అమలు భాగస్వామిగా అక్షయ పాత్ర దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న పిల్లలకు తాజా, పోషకాహార భోజనాన్ని అందిస్తోంది. ప్రస్తుతం 16 రాష్ట్రాలు మరియు 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 78 కేంద్రాల ద్వారా రోజుకు 23.5 లక్షల మంది పిల్లలకు భోజనం అందిస్తూ, 2030 నాటికి రోజుకు 30 లక్షల మంది పిల్లలకు సేవలను విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో అక్షయ పాత్ర 5 కేంద్రికృత వంటశాలల ద్వారా రోజుకు సుమారు 2.5 లక్షల మంది విద్యార్థులకు పోషకాహార భోజనం అందిస్తోంది. ఆధునిక సాంకేతికతతో నడిచే భారీ వంటశాలల ద్వారా ప్రతిరోజూ లక్షలాది పిల్లలకు భోజనం అందిస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




