అశ్రునయనాల మధ్య అజిత్ అంత్యక్రియలు

-ప్రభుత్వ లాంఛనాలతో దివంగత నేతకు వీడ్కోలు
-కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరుల నివాళి

ముంబై, ప్ర‌జాతంత్ర‌, జ‌నవరి29: అశ్రునయనాల మధ్య దివంగత మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిశాయి. గురువారం ఉదయం పుణెలోని బారామతి సమీపంలోగల విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. పవార్ పెద్దకుమారుడు అంత్యక్రియలను నిర్వహించారు. అంతకముందు.. కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నితిన్ నబిన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ శ్రద్దాంజలి ఘటించారు. తమ అభిమాన నేతకు తుది వీడ్కోలు పలికేందుకు ప్రతిష్ఠాన్ మైదానానికి ప్రజలు పోటెత్తడంతో ఆ ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. ప్రభుత్వ లాంఛనాల నడుమ తండ్రి చితికి ఆయన కుమారుడు నిప్పంటించారు. అజిత్ పవార్‌కు తుది వీడ్కోలు పలుకుతూ ఆయన భార్య సునేత్ర, ఇతర కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. అజిత్ పవార్‌ను కోల్పోయినందుకు పార్టీ నేతలు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. బుధవారం ఉద‌యం విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత అజిత్ పవార్ అంత్యక్రియలు బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ గ్రౌండ్‌లో ప్రభుత్వ లాంఛనాలతో చేపట్టారు.  గురువారం ఉదయం ప్రారంభమైన అంతిమ యాత్రలో వేల మంది అభిమానులు పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఎపి మంత్రి నారా లోకేష్ సహా చాలా మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు.బారామతి విమానాశ్రయం దగ్గర జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ (66) మరణించారు. ఈ దుర్ఘటనలో మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు.

అజిత్ మృ తదేహాన్ని మంగళవారం రాత్రి పుణ్యశ్లోక అహిల్యాదేవి ఆస్పత్రి నుంచి కాటేవాడిలోని ఇంటికి తరలించారు. ఉదయం 9 గంటలకు విద్యా ప్రతిష్ఠాన్ క్యాంపస్ నుంచి అంతిమ యాత్ర మొదలైంది. పూలతో అలంకరించిన రథంలో మ తదేహాన్ని తీసుకెళ్లారు. నగరంలోని ప్రధాన రోడ్ల గుండా ఈ యాత్ర సాగింది. ‘అజిత్ దాదా అమర్ రహే‘ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. తర్వాత భౌతికదేహాన్ని విద్యా ప్రతిష్ఠాన్ గ్రౌండ్‌కు చేర్చారు. అక్కడ రాష్ట్ర లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిగాయి. అజిత్ పవార్ కుమారులు చివరి క్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, శరద్ పవార్, సుప్రియా సూలే సహా అన్ని పార్టీల నేతలూ పాల్గొన్నారు. అజిత్ పవార్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడి, ఇతర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మరోవైపు విమాన ప్రమాదంపై డీజీసీఏ, ఏఏఐబీ దర్యాప్తు మొదలైంది. బ్లాక్‌బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దట్టమైన పొగమంచు, విజిబులిటీ తక్కువగా ఉండటమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక సమాచారం. ఐతే.. దర్యాప్తు తర్వాత పూర్తి నివేదిక వస్తుంది. అందులో ఏం చెబుతారన్నది తేలాల్సిన అంశం. అజిత్ పవార్ మరణంతో మహారాష్ట్రలో మూడు రోజుల రాష్ట్ర సంతాప దినాలు ప్రకటించారు. ఆయనది ప్రమాద మరణమా, లేక కుట్ర పూరిత హత్యా అనే సందేహాలు ఉన్నాయి. అయితే ఈ అనుమానాలను శరద్ పవార్ తోసిపుచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *