ఆదిలాబాద్‌పై సీఎం వరాల జల్లు

– ఎయిర్‌పోర్టు నిర్మించి.. పరిశ్రమలు రప్పిస్తాం
– యూనివర్సిటీ ఏర్పాటుకు హామీ
– సిమెంట్‌ ‌పరిశ్రమను తెరిపించి యువతకు ఉద్యోగాలు
– రూ.18.7 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన
– ఆదిలాబాద్‌ ‌పర్యటనలో సీఎం రేవంత్‌ ‌

ఆదిలాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబరు4: ఆదిలాబాద్‌ ‌జిల్లాపై సీఎం రేవంత్‌ ‌రెడ్డి వరాల జల్లు కురిపించారు. ఎయిర్‌పోర్టు, యూనివర్సిటీ, తుమ్మిడిహట్టి ద్వారా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత తనదని ప్రకటించారు. ఎయిర్‌పోర్టుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏడాదిలోపు ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభిస్తామని వ్యాఖ్యానించారు. వరంగల్‌తోపాటు ఆదిలాబాద్‌కు అన్ని రకాల వసతులతో కూడిన ఎయిర్‌పోర్టు ఉండాల్సిందేనని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇక్కడ ఎయిర్‌పోర్టు వొస్తే ఆదిలాబాద్‌కు పరిశ్రమలు వొస్తాయని పేర్కొన్నారు. ఎర్ర బస్సే కాదు.. ఆదిలాబాద్‌కు ఎయిర్‌ ‌బస్సు కూడా తీసుకువొస్తామని చెప్పుకొచ్చారు. ఆదిలాబాద్‌ అభివృద్ధి బాధ్యత నేనే తీసుకుంటానని చెప్పుకొచ్చారు. ఆదిలాబాద్‌లో ఎయిర్‌ ‌బస్‌ను దించి పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. ఏడాది తిరిగేలోపు ఆదిలాబాద్‌లో విమానాశ్రయం నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్‌లో ముఖ్యమంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా రూ.18.7 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. రెండేళ్ల క్రితం వోటును ఆయుధంగా మార్చి నిరంకుశ ప్రభుత్వాన్ని సాగనంపారు. ప్రజలు తెచ్చుకున్న ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంటోంది. సంక్షేమం-అభివృద్ధి రెండుకళ్లుగా భావిస్తూ ముందుకెళ్తున్నాం. రెండేళ్లుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నా. చిన్న వయసులోనే నాకు గొప్ప అవకాశం దక్కడం.. ప్రజల దీవెన, దేవుడి సంకల్పం. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రాజకీయాలకతీతంగా కృషి చేస్తున్నాం. గత ప్రభుత్వం పదేళ్లపాటు విపక్ష ఎమ్మెల్యేలను ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా అనుమతించలేదు. ఎమ్మెల్యేలను కూడా సచివాలయంలోకి రాకుండా అడ్డుకున్న ప్రభుత్వాన్ని గత పదేళ్లలో చూశాం. ఏ ఆశయంతో సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారో.. గత పదేళ్లలో అది నెరవేరలేదు. రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ రైజింగ్‌-2047 ‌డాక్యుమెంటరీ రూపొందించాం. పెట్టుబడులు సాధించే లక్ష్యంతో ఈనెల 8, 9న గ్లోబల్‌ ‌సమ్మిట్‌ ‌నిర్వహిస్తున్నాం అని అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంద్రవెల్లి స్ఫూర్తిగానే గత ప్రభుత్వంపై నేను పోరాటం ప్రారంభించానని అన్నారు. అధికారంలోకి రాగానే ఇంద్రవెల్లి అమరుల స్థూపం పర్యాటకంగా అభివృద్ధి చేసే దస్త్రంపై సంతకం పెట్టాను. ఆదిలాబాద్‌కు సాగునీరు అందేలా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును వైఎస్‌ఆర్‌ ‌చేపట్టారు.

మాజీ సీఎం కేసీఆర్‌ ‌ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కకు పెట్టి రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. మూడేళ్లకే కాళేశ్వరం కూలింది. ప్రజల సొమ్ము దోచుకుని అక్రమ సొమ్ము కోసం ఇవాళ ఆ కుటుంబంలో గొడవలు పడుతున్నారు. అంబేడ్కర్‌ ‌ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్దే నిర్మించి ఆదిలాబాద్‌కు నీరు ఇస్తాం. ఎన్నికల ఉత్సవం పూర్తి కాగానే మరో 40వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తి చేస్తాం అని సీఎం హా ఇచ్చారు.తమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కట్టితీరుతామని స్పష్టం చేశారు.ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తానే వొస్తానని తెలిపారు. ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయని వివరించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇంద్రవెల్లిని పర్యాటక కేంద్రంగా మారుస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే ఆదిలాబాద్‌కు మళ్లీ వొస్తానని, రోజంతా సమస్యలపై సక్షిస్తానని తెలిపారు. ఎడ్యుకేషన్‌, ఇరిగేషన్‌, ‌కమ్యూనికేషన్‌లో ఆదిలాబాద్‌ అభివృద్ధి చెందుతోందని వివరించారు. ఆదిలాబాద్‌లో తప్పకుండా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. వర్సిటీ ఎక్కడ కట్టాలో స్థానిక నేతలంతా కలిసి ఒక నిర్ణయానికి రావాలని సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇంద్రవెల్లిలో యూనివర్సిటీ కడితే బాగుంటుందని తన భావన అని తెలిపారు. అనుమతి మాత్రమే తనదని.. ఎక్కడ కట్టాలో నిర్ణయం దేనని చెప్పుకొచ్చారు. ఏడాదిలో 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. రాబోయే రోజుల్లో మరో 40 వేల ఉద్యోగాలు ఇస్తామని స్పష్టం చేశారు. మన యువత ఐఏఎస్‌, ఐపీఎస్‌లు అయినప్పుడే తనకు సంతోషమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. చదువుకుని తెలంగాణ ఖ్యాతిని దశదిశలా చాటాలన్నారు. సర్పంచ్‌లను చూసి ఎన్నుకోవాలని, పనిచేసే వారికే అవకాశం ఇవ్వాలన్నారు. మంత్రులు వివేక్‌ ‌వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు, తదితరులు సభలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *