గుత్తాధిపత్యంలో విమానయాన సంస్థ

– అందుకే ఇండిగో విమానాల ప్రతిష్టంభన
– ఇండిగోను ఏం చేయలేని దుస్థితిలో కేంద్రం
– తాజా పరిస్థితులపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబరు6: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభంపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌స్పందించారు. గత ఐదు రోజుల నుంచి ఎయిర్‌పోర్టులు అన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల కంటే అధ్వాన్నంగా మారిపోయాయని విమర్శించారు. కొంతమంది చేతుల్లోనే శక్తి కేంద్రీకృతమైతే జరిగే దుష్పరిణామాలకు ఇది గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇండిగో విమానాలను ఆపేయడంతో ఎయిర్‌పోర్టుల్లో వేలాది మంది తన్నుకునే పరిస్థితి వచ్చిందని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఇండిగో ఎందుకు బంద్‌ ‌పెట్టిందో కారణాన్ని ఆయన వివరించారు. శ్రమ దోపిడీ చేయవద్దని.. పైలట్లు వారానికి ఇంత సమయం మాత్రమే విమానాలు నడపాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఏడాది కింద ఒక రూల్‌ ‌తీసుకొచ్చిందని తెలిపారు. కానీ దేశంలోని విమానయాన శాఖ మొత్తం ఇండిగో, ఎయిరిండియా చేతుల్లోనే ఉందని.. దీంతో ఏడాది కింద కేంద్ర ప్రభుత్వం రూల్‌ ‌తీసుకొచ్చినప్పటికీ వాళ్లు మారలేదని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయం కూడా ఏర్పాటు చేసుకోలేదని చెప్పారు. దీనివల్ల ఒక్కరోజే ఇండిగో సంస్థ వెయ్యి విమానాలు రద్దు చేయాల్సి వచ్చిందన్నారు. ఆ దెబ్బతో ఎయిర్‌పోర్టులు అన్ని అధ్వాన్నంగా తయారయ్యాయని చెప్పారు. ఎయిర్‌పోర్టులు బస్టాండ్లలా మారిపోయాయని విమర్శించారు. విమానయాన శాఖ మొత్తం ఇద్దరి చేతుల్లోనే ఉండటంతో కేంద్ర ప్రభుత్వమే తగ్గాల్సి వచ్చిందని కేటీఆర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం రూల్‌ ‌తీసుకొచ్చినప్పటికీ.. ఇండిగో సంస్థ తన నిర్ణయాన్ని మార్చుకోలేదని తెలిపారు. తప్పు చేశానని ఒప్పుకోలేదని.. అయినప్పటికీ వారికి ఫైన్‌ ‌వేసే దమ్ము లేదని అన్నారు. చివరకు కేంద్ర ప్రభుత్వమే తగ్గి గతంలో ఇచ్చిన రూల్‌ను వెనక్కి తీసుకుందని.. విమానయాన కంపెనీలకు కొంత సమయం ఇచ్చిందని పేర్కొన్నారు. కొంతమంది చేతుల్లోనే శక్తి ఉంటే జరిగే దుష్పరిణామాలకు ఇదొక గొప్ప ఉదాహరణ అని తెలిపారు. పోర్టులు, సీపోర్టులు ఇలా అన్ని ఒకరి చేతిలోనే ఉంటే.. ఒకరు మునిగినప్పుడు అందరూ మునగాల్సి వస్తుందని చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *