– ఆ దిశగా రెండో విడత సీఎం కప్- 2025
– స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: గ్రామీణ క్రీడా ప్రతిభను వెలికితీయడం, క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వడం లక్ష్యంగా రెండో విడత సీఎం కప్–2025 పోటీలను నిర్వహించనున్నట్లు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడాభివృద్ధి అధికారులతో ఈరోజు నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి 8, 9, 10, 11 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లాల వెసులుబాటును బట్టి టార్చ్ రిలే (క్రీడాజ్యోతి) కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. జనవరి 17 నుంచి గ్రామస్థాయి పోటీలు ప్రారంభమవుతాయని, గ్రామ, మండల, జిల్లా స్థాయిలతో పాటు మొట్టమొదటిసారిగా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో కూడా ఈసారి పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మొత్తం 44 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈసారి సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలు కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం కాకుండా ఉమ్మడి జిల్లా కేంద్రాలతో పాటు మరికొన్ని జిల్లాలకు విస్తరించి నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోని బాలాదేవి మాట్లాడుతూ, క్రీడాకారుల సమాచారాన్ని ఆన్‌లైన్ ద్వారా సేకరించాలని, కలెక్టర్ల ఆధ్వర్యంలో వివిధ జిల్లా శాఖల అధికారుల సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు, వివిధ క్రీడా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో సీఎం కప్ పోటీలు విజయవంతం చేయాలని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్లు చంద్రారెడ్డి, రవీందర్, డాక్టర్ రవితేజ, ఎస్.ఎం. భాష, అనిత, సుజాత, పద్మావతి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





