ఏఐకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరం

– భారత్‌ను ప్రపంచ ఏఐ పవర్‌హౌస్‌గా నిర్మించాలి
– తెలంగాణలో ఏఐ స్టార్టప్ విలేజీ ఏర్పాటుకు సిద్ధం
– దిల్లీలోని ఏఐ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 20: యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ ముందంజలో నిలవాలంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏఐ వినియోగం, నియంత్రణ, చట్టపరమైన మార్గదర్శకాలు, జాతీయ భద్రత వంటి అంశాలను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేక వ్యవస్థ అవసరమని స్పష్టం చేశారు. దిల్లీలో నిర్వహిస్తున్న ఏఐ సమ్మిట్‌లో శుక్రవారం ప్రసంగించిన సీఎం మానవ చరిత్రలో అగ్ని, చక్రం, వ్యవసాయం, విద్యుత్, ఇంటర్నెట్ వంటి ఆవిష్కరణలు ప్రపంచాన్ని ఎలా మార్చాయో గుర్తుచేశారు. ఏఐ కూడా అలాంటి విప్లవాత్మక సాంకేతికతేనని, ఇది ఇంకొక టెక్నాలజీ కాదని, మానవ పరిణామ క్రమంలో అత్యంత శక్తివంతమైన మలుపు అని అభివర్ణించారు. మునుపటి యంత్రాల మాదిరిగా కాక ఏఐ స్వయంగా నేర్చుకోగలదని, విశ్లేషించగలదని, నిర్ణయాలు తీసుకోగలదని పేర్కొన్నారు. రోబోటిక్స్‌తో కలిసినప్పుడు యంత్రాలు మానసిక మేధస్సుతోపాటు శారీరక సామర్థ్యాన్ని కూడా పొందుతున్నాయన్నారు. ప్రపంచ ఏఐ పోటీ ఇప్పటికే ప్రారంభమైందని, కొన్ని దేశాలు, కంపెనీలు ముందంజలో ఉన్నాయని సీఎం చెప్పారు. గత పారిశ్రామిక విప్లవాల సమయంలో జరిగిన అవకాశ నష్టాలను గుర్తు చేస్తూ ఈసారి భారత్ అలాంటి తప్పిదం చేయకూడదని హెచ్చరించారు. సేవలు, సాఫ్ట్‌వేర్ రంగాల్లో విజయం సాధించిన భారత్, ప్రపంచస్థాయి కోర్ టెక్నాలజీ ఉత్పత్తుల్లో కూడా నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. దేశానికి తక్షణ జాతీయ ఏఐ రోడ్‌మ్యాప్ అవసరమని నొక్కిచెప్పారు. ఏఐ అభివృద్ధి ప్రతి దశలో సెమీకండక్టర్ చిప్ తయారీ, జీపీయూ సామర్థ్యాలు, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ వినియోగం, ఏఐ ప్లాట్‌ఫారమ్‌లు, అప్లికేషన్లు భారత్ స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగాలని సూచించారు.

జాతీయ ఏఐ వార్ రూమ్ నిర్వ‌హ‌ణ‌కు మేం సిద్ధం

ప్రపంచవ్యాప్తంగా ఏఐ పరిణామాలను నిశితంగా పర్యవేక్షించేందుకు కేంద్రం-రాష్ట్రాల సమన్వయంతో జాతీయ ఏఐ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కేంద్రం అనుమతిస్తే హైదరాబాద్‌లో అలాంటి వార్ రూమ్ నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రపంచస్థాయి పరిశోధనలకు ఊతమిచ్చే ఏఐ యూనివర్సిటీని స్థాపించాలని సూచించారు. ఏఐ విస్తరణ నేపథ్యంలో ఉపాధిపై కలుగుతున్న ఆందోళనలను ప్రస్తావిస్తూ కొన్ని రంగాల్లో ఉద్యోగ నష్టాలు సంభవించవచ్చన్నారు. అయితే సరైన రీ-స్కిల్లింగ్, అప్-స్కిల్లింగ్ చర్యల ద్వారా ఏఐ వల్ల సృష్టి జరిగే కొత్త అవకాశాలు మరింత విస్తృతంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. యువతను ఏఐ-ఆధారిత భవిష్యత్తుకు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. స్టార్టప్‌లకు మద్దతు కల్పించేందుకు జాతీయ ఏఐ నిధి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా ఏఐ ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచే ఏఐ స్టార్టప్ విలేజ్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఏఐ రంగంలో విధానాలు, చట్టాలు, నైతిక ప్రమాణాలకు మార్గనిర్దేశం చేసే అత్యున్నత సంస్థగా ఇండియా ఏఐ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రిని కోరారు. ఏఐ అభివృద్ధి సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలన, ప్రజా సేవల మెరుగుదల, జాతీయ భద్రతకు తోడ్పడేలా ఉండాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. బాధ్యతాయుతమైన, సమ్మిళిత, భవిష్యత్ దృష్టితో కూడిన ఏఐ వ్యవస్థను నిర్మించేందుకు ప్రపంచ నిపుణులు, సంస్థలు కలిసి పనిచేయాలని కోరారు. ఈ మార్పు యుగంలో భారత్ నాయకత్వం వహించాల్సిన సమయం ఇదేనని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *