ఆర్టీసీలో ఏఐ వినియోగం

– మరింత వేగంగా సేవలకు నిర్ణయం
– ఏఐ వినియోగం కోసం ప్రత్యేక టీమ్‌ ఏర్పాటు
– ఆర్టీసీ యాజమాన్యానికి మంత్రి పొన్నం అభినందన

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 24: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తమ సేవలను మెరుగుపరుచుకునేందుకు ఆర్‌టిసి మరో గొప్ప అడుగు వేసింది. అన్ని రంగాలను ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ ‌(ఏఐ)ను విస్తృతంగా వినియోగించాలని నిర్ణయించింది. తమ ఉత్పాదకత పెంపు, సిబ్బంది పనితీరు, ఆరోగ్య స్థితి పర్యవేక్షణ, ఖర్చుల తగ్గింపు, రద్దీకి అనుగుణంగా సర్వీసుల ఏర్పాటుతో పాటు సేవలను మరింత ప్రజానుకూలంగా తీర్చిదిద్దడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. దేశంలోనే తొలిసారిగా ఏఐ వినియోగించిన ప్రజా రవాణా సంస్థగా తెలంగాణ ఆర్‌టిసి నిలిచింది. ఎఐ ప్రాజెక్టు అమలుకు హన్స ఈక్విటీ- పార్ట్‌నర్స్ ఎల్‌ఎల్‌పి అనే సంస్థ ఆర్‌టిసికి తోడ్పాటు అందిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం, ప్రణాళికాబద్ధమైన అమలు వ్యూహాలను అందించి, అన్ని డిపోల్లో సులభంగా అమలు జరిగేలా ఆ సంస్థ సహకరిస్తోంది. సంస్థలో ఏఐ వినియోగం కోసం ఒక ప్రత్యేక టీంను యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఏఐ వాడకంపై ఆ టీమ్‌కు హన్స ఈక్విటీ- పార్ట్‌నర్స్ ‌శిక్షణ ఇస్తోంది. ప్రాజెక్టులో భాగంగా మొదట 40 వేల మంది సిబ్బంది ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నారు. గ్రాండ్‌ ‌హెల్త్ ‌ఛాలెంజ్‌లో భాగంగా ఉద్యోగులకు చేసిన వైద్య పరీక్షల ఆధారంగా ఆరోగ్య పరిస్థితిని ఏఐ, మెషిన్‌ ‌లెర్నింగ్‌ ‌సహకారంతో అంచనా వేస్తున్నారు. మొదట పైలట్‌ ‌ప్రాజెక్టుగా ఆరు డిపోల్లో అమలు చేయగా మంచి ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం అన్ని డిపోల్లోనూ ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. త్వరలోనే ఏఐ ద్వారా ఆటోమెటిక్‌ ‌షెడ్యూలింగ్‌ను సంస్థ ప్లాన్‌ ‌చేస్తోంది. రోజు, తిథి, పండుగలు, వారాల్లో ఏఐ మెషిన్‌ ‌లెర్నింగ్‌ ‌సహకారంతో ప్రయాణికుల రద్దీని అంచనా వేసి ఆ మేరకు బస్సులను సంస్థ ఏర్పాటు చేయనుంది. ఆర్‌టిసిలో ఎఐ ప్రాజెక్ట్ అమలు తీరు గురించి డాక్టర్‌ ‌బిఆర్‌ అం‌బేద్కర్‌ ‌సచివాలయంలో ఇటీవల రవాణా, బిసి సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్‌కి పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ‌ద్వారా సంస్థ ఉన్నతాధికారులు వివరించారు. ఆధునిక రవాణా అవసరాలకనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు సంస్థను ఆర్థికంగా, సాంకేతికంగా బలోపేతం చేసేందుకు 2021 నుంచే అమలు చేస్తున్న స్ట్రాట్రజిక్‌ ‌డిప్లాయ్మెంట్‌ ‌ప్లాన్‌ (ఎస్‌డిపి) కీలక పాత్ర పోషిస్తున్నదని ఉన్నతాధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తమ పనితీరు మెరుగుపరచుకోడానికి ఏఐని వినియోగించుకోవడంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌సంతోషం వ్యక్తం చేశారు. ఆర్‌టిసి ఉన్నతాధికారుల కృషిని అభినందించారు.ప్రపంచంలో ప్రస్తుతం ఏఐ ప్రభావితం చేయని రంగమే లేదని, రవాణా వ్యవస్థలో మార్పులను గుర్తించి ప్రజల రవాణా అవసరాలకు అనుగుణంగా ఎఐని వినియోగించుకోవాలని భావించడం గొప్ప విషయమని ఆయన అన్నారు.సంస్థ అభివృద్ధిలో భాగస్వాములుగా పనిచేస్తూ 2021 నుంచి కార్పొరేట్‌ ‌సోషల్‌ ‌రెస్పాన్సిబిలిటీ కింద ఎస్‌డిపి అమలు, ఏఐ ప్రాజెక్ట్ ‌రూపకల్పనలో విశేషంగా తోడ్పడిన హన్స ఈక్విటీ పార్ట్‌నర్స్ ఎల్‌ఎల్‌పికి చెందిన త్రినాధబాబు, సునీల్‌ ‌రేగుళ్లను మంత్రి ‌ప్రత్యేకంగా అభినందించి, సన్మానించారు. సంస్థను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా బలోపేతం చేసేందుకే ఎఐ ప్రాజెక్టు అమలు చేస్తున్నామని ఆర్‌టిసి ఎండి సజ్జనార్‌ ‌తెలిపారు. సమావేశంలో సంస్థ ఈడీలు మునిశేఖర్‌, ‌ఖుష్రోషా ఖాన్‌, ‌వెంకన్న, రాజశేఖర్‌, ‌సిటిఎం శ్రీదేవి, సిపిఎం ఉషాదేవి, సిఈఐటి శ్రీదేవి తదితర అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *