ఏఐ ఆధారిత డ్రోన్ పోలీసింగ్‌తో బందోబస్తు

– మేడారం జాతరలో డీజీపీ
– గవర్నర్, మంత్రి సీతక్కలతో కలిసి వనదేవతల దర్శనం

హైదారాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30: మేడారం మహా జాతర చరిత్రలో తొలిసారిగా ప్రవేశపెట్టిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం భద్రతలో కీలక మార్పులు తీసుకొచ్చిందని డీజీపీ బి.శివధర్‌రెడ్డి వెల్లడించారు. మేడారం వనదేవతలు సమ్మక్క-సారలమ్మల మహా జాతరకు భక్తజనసందోహం పోటెత్తిన వేళ క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి శుక్రవారం మేడారంలో పర్యటించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి సీతక్కతో కలిసి గద్దెల వద్దకు చేరుకున్న డీజీపీ వనదేవతలను దర్శించుకుని మొక్కులుగా నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ ‘మేడారం 2.0’ పేరుతో అమలు చేస్తున్న ‘టీజీ-క్వెస్ట్‌’ కృత్రిమ మేధ ఆధారిత డ్రోన్ పోలీసింగ్ వ్యవస్థ ద్వారా సుమారు 30 చదరపు కి.మీ మేర ప్రతి అంగుళాన్ని నిశితంగా గమనిస్తున్నామన్నారు. ఈ డ్రోన్లు డిజిటల్ బీట్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తూ అటవీ ప్రాంతం, జంపన్న వాగు వంటి ప్రదేశాల నుంచి ఎప్పటికప్పుడు ప్రత్యక్ష సమాచారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. జాతరలో రద్దీ పెరిగిన నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను ఆయన పరిశీలించారు. జనసందడిలో పిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్లు మంచి ఫలితాలనిస్తున్నాయని, పాత నేరస్తులను గుర్తించేందుకు ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్, అనుమానాస్పద వస్తువులను పసిగట్టేందుకు ఏఐ అలర్ట్స్ వాడుతున్నామని వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం 13 వేల మందికి పైగా పోలీస్ సిబ్బంది ఏడు రోజులపాటు నిరంతరం విధుల్లో ఉంటారని డీజీపీ వెల్లడించారు. వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా 2000 ఎకరాల్లో 37 పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేసి వాటిని ఏఎన్పీఆర్ నిఘా వ్యవస్థతో అనుసంధానించామన్నారు. దాదాపు 450 సీసీటీవీల ద్వారా జాతరలోని ప్రతి కదలికను హైదరాబాద్‌లోని రాష్ట్ర కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. భక్తుల సౌకర్యార్థం 3800 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయని, జాతరలో ఎక్కడ ఏ సమస్య ఎదురైనా తక్షణమే స్పందించేలా 24 గంటలపాటు పోలీస్ హెల్ప్ డెస్కులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మల్టీ జోన్-1 ఐజీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, ములుగు ఎస్పీ కేకన్ సుధీర్ రామ్ నాథ్, మేడారం బందోబస్తు కోసం వచ్చిన ఐపీఎస్ అధికారులు డీజీపీ వెంట ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *