రైతులకు వెన్నుదన్నుగా వ్యవసాయ కళాశాల

– దేశాన్ని ముందుకు నడిపేది విజ్ఞానం, పరిశోధనలే
– వాటితో వ్యవసాయానికి అభినాభావ సంబంధం
– వ్యవసాయాధారిత దేశానికి వ్యవసాయ కళాశాలల ఆవశ్యకత ఎంతో
– మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి దర్శనం భగవత్ సంకల్పమే
– ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకమారు ఎంపీగా గెలవడం గొప్ప విషయమే
– రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, జనవరి 23: హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో నెలకొల్పనున్న వ్యవసాయ కళాశాల రైతాంగానికి వెన్నుదన్నుగా నిలుస్తుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. వ్యవసాయ అభివృద్ధికి ఈ కళాశాల ఎంతగానో ఉతమిస్తుందని ఆయన అన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని మగ్దుంనగర్‌లో రూ.123 కోట్లతో ఏర్పాటు చేయనున్న వ్యవసాయ కళాశాలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో శుక్రవారం శంకుస్థాపన చేశారు. వ్యవసాయ కళాశాలతోపాటు కోదాడ నియోజకవర్గ కేంద్రంలో నెలకొల్పనున్న జవహర్ నవోదయ విద్యాలయం, మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో వసతి గృహం, వంటశాలకు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాU మంత్రి ఆధ్వర్యంలో జరిగిన శంకుస్థాపనలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తూ పరిశోధనలకు, విజ్ఞానానికి వ్యవసాయంతో అవినాభావ సంబంధం ఉందని, అలాంటి కళాశాల వ్యవసాయాధారిత ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని అన్నారు. వ్యవసాయ కళాశాల ఆవశ్యకతని గుర్తించి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దానిని మంత్రి ఉత్తమ్ ఏర్పాటు చేయాలనుకోవడం ప్రశంశనీయమన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతుల అహ్వానంతోనే కళాశాల శంకుస్థాపనకు వ‌చ్చాన‌ని, అత్యంత ప్రాశస్త్యం కలిగిన మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడం ముమ్మాటికీ భగవత్ సంకల్పమేనని, మహద్భాగ్యమని అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులకు ఆయన వేదిక మీద నుండే కృతజ్ఞతలు తెలిపారు. పవిత్ర కృష్ణా నదిని చూడడం కూడా గొప్ప అనుభూతిని మిగిల్చిందని గవర్నర్ చెప్పారు. మంత్రి ఉత్తమ్ కుమార్ గురించి ప్రస్తావిస్తూ తానూ రాజకీయాలలో ఉన్నానని, అయితే మంత్రి ఉత్తమ్ తరహాలో ఇంతటి ప్రజాభిమానాన్ని చూరగొన్న నేత అరుదుగా ఉంటారని పేర్కొన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకమారు ఎంపీగా గెలవడం అంటే అసామాన్యమైన విషయమని అభివర్ణించారు. ఒక్క మాటలో చెప్పాలంటే సైన్యంలో చేరి పైలట్‌గా రాణించిన మంత్రి ఉత్తమ్ రాజకీయాలలో చేరి అభివృద్ధి కోసం ఫైటర్‌గా మారాడని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, ఉత్తమ్ పద్మావతీ రెడ్డి, బీ.ఎల్.ఆర్, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *