– సరికొత్త ఆవిష్కరణల వేదికగా వ్యవసాయ మేళా
– ఆకట్టుకున్న వివిధ స్టాళ్లు
– నాగలి నుండి నవతరం డ్రోన్ వరకు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: ప్రజా పాలన- 99 రోజుల ప్రణాళికలో భాగంగా రైతుల అభివృద్ధి, సాంకేతిక అవగాహన పెంపు లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రైతు ఉత్సవాలకT రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుండి విశేష స్పందన లభించింది. ఉగాది పర్వదినాన మంత్రులు, అసెంబ్లీ స్పీకర్, శాసన మండలి చైర్మన్ ప్రారంభించిన రైతు ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక వ్యవసాయ మేళా రైతులను ఆకట్టుకుంది. సుమారు అయిదెకరాల విస్తీర్ణంలో 150 స్టాల్స్ ఏర్పాటు చేసి వ్యవసాయ, అనుబంధ శాఖలైన ఉద్యాన, పట్టు పరిశ్రమ, పశు సంవర్ధక శాఖ, నీటిపారుదల శాఖ, మార్క్‌ఫెడ్, ఆయిల్ ఫెడ్ వంటి ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రైవేట్ సంస్థలు, అంకుర సంస్థలు కూడా ఈ మేళాలో పాల్గొన్నాయి. నాణ్యమైన విత్తన రకాల ప్రదర్శన, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు,సేంద్రియ వ్యవసాయం, సమగ్ర వ్యవసాయ విధానాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీ వివరాలు, శాస్త్రీయ సాగు పద్ధతులు, రైతులకు అందుబాటులో ఉంచారు. ప్రత్యేకంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అధిక పాల దిగుబడి ఇచ్చే దేశీయ, విదేశీ సంకరజాతి ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్లు ప్రదర్శించారు. అలాగే కుందేళ్ళ, తేనెటీగల పెంపకం వంటి ఉపాధి అవకాశాలపై కూడా అవగాహన కల్పించారు. బిందు సేద్య పరికరాలు, సౌర విద్యుత్ ఉత్పత్తి విధానాలు, పాల ఉత్పత్తుల ప్రాసెసింగ్ (పెరుగు, నెయ్యి, పనీర్, పాలకోవా తయారీ) వంటి అంశాలపై ప్రదర్శనలు నిర్వహించి చిన్న పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి మార్గదర్శనం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు మూడు రోజులపాటు రైతులకు సాంకేతిక శిక్షణలు అందించారు.
ఆకట్టుకున్న ఆధునిక సాంకేతికతలు
శాటిలైట్ ఆధారిత పంట పర్యవేక్షణ (మొబైల్ యాప్ ద్వారా) రిమోట్ ద్వారా మోటార్ ఆన్/ఆఫ్ సదుపాయం, నాటు యంత్రాలు: కూలీల కొరతకు పరిష్కారం, చక్రం కలిగిన స్ప్రేయర్లు : వేగవంతమైన పిచికారీ, విత్తన యంత్రాలు- విత్తన వృథా నివారణ, డ్రోన్ ఆధారిత పురుగుమందుల పిచికారీ, రిమోట్ ఆధారంగా నడిచే ట్రాక్టర్.. ఈ సాంకేతికతల ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని సాధించే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. ముఖ్యంగా ‘నాగలి నుండి నవతరం డ్రోన్ వరకు’ అనే థీమ్‌తో పాత పద్ధతుల నుండి ఆధునిక సాంకేతికతల వరకు వ్యవసాయ పరిణామాన్ని ప్రత్యక్షంగా చూపించారు. నాలుగు రోజులపాటు నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది రైతులు హాజరై సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పొందారు. రైతుల సౌలభ్యం కోసం వ్యవసాయ శాఖ ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పించింది. చివరి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలసి వ్యవసాయ స్టాళ్లు సందర్శించి నిర్వాహకులతో మాట్లాడారు. అనంతరం ముఖ్యమంత్రి చే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, ఆయిల్ పామ్ రిఫైనరీ శంకుస్థాపనతోపాటు 68,89,955 రైతులకు రూ.3446.94 కోట్లను నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేసే ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం 30 వేల మంది రైతులనుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఎంపీ రఘునందన్ రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





