దేశ ఏరోస్పేస్‌ రాజధానిగా తెలంగాణ

– రాష్ట్రంలో ఏరోస్పేస్‌ ఎకోసిస్టమ్‌ బలోపేతంపై మేధోమథనం
– పారిశ్రామికవేత్తలు, నిపుణుల సలహాలు, సూచనల స్వీకరలి
– ఏరోస్పేస్‌ ఎంఎస్‌ఎంఈ పార్క్‌, పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌
– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26: తెలంగాణను దేశ ఏరోస్పేస్‌ రాజధానిగా తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఫిక్కీ తెలంగాణ ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ కమిటీ సహకారంతో రాష్ట్రంలోని ప్రముఖ ఏరోస్పేస్‌ పారిశ్రామికవేత్తలు, నిపుణులతో ఆయన సచివాలయంలో శుక్రవారం మేధోమథనం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏరోస్పేస్‌ ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్తు ప్రణాళికలపై సలహాలు, సూచనలు స్వీకరించారు. రాష్ట్రంలో ఏరోస్పేస్‌ ఎకోసిస్టం బలోపేతానికి 60 ఏళ్ల కిందటే బలమైన అడుగులు పడ్డాయి. ఇప్పుడా ఫలితాలు మన కళ్ల ముందు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇప్పటికే 30కిపైగా ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ ఓఈఎంఎస్‌లు, వేయికి పైగా ఎంఎస్‌ఎంఈలు ఉన్నాయి. డీఆర్డీవో, హాల్‌, జీఎంఆర్‌, టాటా, అదానీ ఎల్బిట్‌, సాఫ్రాన్‌, బోయింగ్‌- టీఏఎస్‌ఎల్‌ జేవీ వంటి దిగ్గజ సంస్థల కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది అని వివరించారు. రాష్ట్ర ఏరోస్పేస్‌ ఎగుమతుల విలువ రూ.28,000 కోట్లకు పైగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుంటూనే దేశ ఏరోస్పేస్‌ రాజధానిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఈ ప్రక్రియలో సంబంధిత పరిశ్రమలు, నిపుణులను భాగస్వామ్యం చేస్తున్నాం’ అని వివరించారు. ‘ఆదిభట్ల ఏరోస్పేస్‌ సెజ్‌ తరహాలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రంలో ఫేజ్‌-2 ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ క్లస్టర్‌ విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ప్రత్యేక ఏరోస్పేస్‌ ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేయబోతున్నాం. హైదరాబాద్‌ను గ్రీన్‌ ఏవియేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దేలా డ్రోన్‌ టెక్నాలజీ, గ్రీన్‌ ఏవియేషన్‌ ఫ్యూయల్స్‌ రంగాలకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటాం అని చెప్పారు. పారిశ్రామికాభివృద్ధి, అనుమతుల్లో జాప్యం తలెత్తకుండా అధికారులు, పారిశ్రామికవేత్తలు, నిపుణులతో కూడిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. ఏరోస్పేస్‌ రంగంలో స్కిల్డ్‌ వర్కర్స్‌ కొరత తీవ్రంగా ఉందని, ఈ సమస్యను అధిగమించేందుకు రాష్ట్రంలోని ఐటీఐలు, పాలిటెక్నిక్‌ కళాశాలలను దత్తత తీసుకోవాలని ఇక్కడికొచ్చిన పారిశ్రామికవేత్తలను కోరుతున్నానన్నారు. మీ సహకారంతో తెలంగాణ యువతను డిజైన్‌, ఏవియానిక్స్‌, కాంపోజిట్స్‌, డిజిటల్‌ ట్విన్‌ టెక్నాలజీ తదితర అధునాతన రంగాల్లో అత్యుత్తమ మానవ వనరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని వివరించారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ నిఖిల్‌ చక్రవర్తి, హెచ్‌సీ రోబోటిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ డా.రాధాకృష్ణ, ఫిక్కీ తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ హెడ్‌ రాజీవ్‌ జూలకంటి, కో-ఛైర్మన్‌ జయదేవ్‌ మీలా, దిగ్గజ ఏరోస్పేస్‌ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *