వానాకాలం పంటలకు ముందస్తు ప్రణాళికలు

యాసంగిలోనూ రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు
అర్హులైన లబ్ధిదారులకు తెల్ల రేషన్ కార్డులు
10,665 కోట్ల వ్యయంతో 2.81 కోట్ల మందికి ఉచితంగా సన్న బియ్యం
నీటి సామర్ధ్యం పెంపున‌కు ప్రాజెక్టులలో పూడికతీత పనులు
అవినీతికి పాల్పడితే చర్యలు కఠినం
నీటిపారుద‌ల శాఖ‌ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక వానాకాలం సీజన్ లో రికార్డ్ సృష్టించిన ధాన్యం దిగుబడి యాసంగి సీజన్ లోనూ అదే రికార్డు పునరావృతమైంద‌ని  నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక రైతాంగం పట్ల అనుసరించిన విధానాలే రికార్డు స్థాయిలో పంట దిగుబడికి తార్కాణమన్నారు. శనివారం సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో సహచర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లతో కలసి ధాన్యం కొనుగోళ్లు, వానాకాలం సీజన్ వ్యవసాయ ప్రణాళికలు, ఇందిరమ్మ ఇళ్ళు,భూ భారతి, నీటిపారుదల రంగంపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముందెన్నడూ లేని రీతిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ జరగనంత దిగుబడి ఈ సంవత్సర కాలంలో వానాకాలం, యాసంగి సీజన్లలో వొచ్చిందని ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఆల్ టైం రికార్డ్ గా ఆయన అభివర్ణించారు. తెలంగాణ రైతాంగం పండించిన పంటలో చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఆయన సుస్పష్టం చేశారు. నిరుపేదలకు సన్న బియ్యం అందించాలన్న చారిత్రత్మక నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 10,665 కోట్లను వ్యయం చేసి అర్హులైన నిరుపేదలకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున ఉచితంగా నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు.

పేదల ఆకలిని తీర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మకమైన నిర్ణయం సన్న బియ్యం పంపిణీ అన్నారు. అప్పటి వరకు అందించిన దొడ్డు బియ్యం ప్రజలు వినియోగించక పోగా పక్క దారి పట్టి అనేక అక్రమాలకు తెర లేస్తుండడంతో గమనించిన రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణికీ శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులలో నీటి సామర్ధ్యం పెంపున‌కు రాష్ట్ర ప్రభుత్వం అంకురార్పణ చుట్టిందన్నారు. బిఆర్ఎస్ పాలనలో బ్రష్టు పట్టిన నీటిపారుదల రంగంలో వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు.  అందులో భాగంగానే మట్టి మేటలు,ఇసుక దిబ్బలతో పేరుకుపోయిన చారిత్రాత్మక శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పూడిక తీత మొదలు పెట్టి నీటి సామర్థ్యం పెంపున‌కు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందన్నారు.  బిఆర్ఎస్ హయంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయన స్పందిస్తూ భవిష్యత్ తరలను అప్పుల ఊబిలో దింపారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చేవెళ్ల-ప్రాణహిత పేరుతో కేవలం 38 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును రీ డిజైన్ పేరుతో లక్ష కోట్లకు పెంచి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని ఆయన దుయ్యబట్టారు. ప్రాధాన్యత క్రమంలో పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలకు రూట్ మ్యాప్ రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు అందుకు అవసరమైన భూ సేకరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ప్రజా సమస్యలపై సత్వర చర్యలు ఉంటాయన్నారు.ఫిర్యాదుల విషయంలో అధికారులు సకాలంలో స్పందించని పక్షంలో చర్యలు కఠినంగా ఉంటాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *