తిరుమల లడ్డూలో కల్తీ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే సీబీఐ ఛార్జ్ షీట్, ఇతర ల్యాబుల్లో లడ్డూ, నెయ్యిలో ఎలాంటి జంతుకొవ్వు కలవలేదని నిర్ధారణ జరిగింది. అంటే ఆవు, పంది, చేప కొవ్వు, నూనె లాంటి పదార్థాలు కలపలేదని తేల్చేసింది. ఇన్నేళ్లుగా జరుగుతున్న వ్యవహారంలో సీబీఐ ఛార్జ్ షీట్ ఇచ్చిన స్పష్టత.. అసత్య ప్రచారాలను పటాపంచులు చేసిందా అంటే నమ్మకం కలగని అంశమే. ముఖ్యంగా ఆరోపణలు చేసినవాళ్లకు, ఆరోపణలు ఎదుర్కొంటున్నవాళ్లకు మధ్య బలమైన, కచ్చితమైన ఆధారాలు ఉన్నా మరో ప్రత్యామ్నాయం కోసం దాచిపెడుతున్నారనేది తెలుస్తోంది. సీబీఐ ఛార్జ్ షీట్ రిపోర్టు భక్తులకు ఊరట కల్పించేలా, వారి ఉద్వేగాలను అదుపు చేసేలా మాత్రంగానే ఉంది. జంతు కొవ్వు అనేది ఏ రూపంలోనైనా కలవడం నిజమైతే దారుణమైన అంశంగా చూడాల్సిందే. ఇది భక్తుల మనోభావాలు దెబ్బ తీసినట్లే.. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేనట్లే రిపోర్టులు తేల్చిశాయి.
జంతు కొవ్వు, కల్తీ నెయ్యి విషయంలో ప్రభుత్వం ప్రజలకు క్లారిటీ ఇవ్వకుండా కాలయాపన చేస్తోంది. కల్తీ విషయంలో సీఎం చంద్రబాబు బలమైన ప్రశ్నలను లేవనెత్తారు. సీబీఐ ఛార్జ్ షీట్ లో కల్తీ జరిగిన విషయంలో జంతు కొవ్వు, నెయ్యి వేర్వేరు… కానీ రెండూ కలిపి చెప్పడంతో స్పష్టతకు సమస్యగా మారింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం రిపోర్టు ప్రకారం నెయ్యిలో కల్తీ జరిగిందని తేల్చింది. అందులో జంతు కొవ్వు కోసం చెప్పలేదు.. కానీ వేరువేరు నూనెలతో కలిపి నెయ్యి తయారు చేసినట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాప్తు రిపోర్టుతో టీటీడీకి కొన్ని కోట్ల ఆదాయ నష్టం జరిగిందనేది అధికారిక నివేదిక. ఇక భక్తులు, ధార్మిక సంఘాలతో పాటు కోట్లాది మందికి ఒక్కటే అభిప్రాయం పెండింగ్ లో ఉంది. అది ఏంటంటే కల్తీ అంశాన్ని లేవనెత్తిన డిప్యూటీ సీఎం పవన్, సీఎం చంద్రబాబుతో పాటు టీమ్… కల్తీకి పాల్పడిన వారిని వదిలేదే లేదు, కఠినంగా శిక్షిస్తామని బహిరంగ హామీ ఇచ్చిండ్రు.. వారిని శిక్షించాలన్నది భక్తుల మాట… మరి నిందితులెవరు..? శిక్ష ఎప్పుడు పడుతుంది..? ఈ విషయంలో ప్రజల స్పష్టంగా ఉన్నారు… స్పష్టత లేనివారు ఎవరు..?
కాగా ఈ విషయంలో రిపోర్టులపై ప్రభుత్వం మళ్లీ ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. మరింత లోతుగా దర్యాప్తు చేసి బయటపెడతామంటూ ప్రకటించింది. దీనిపై కూడా మరో దుమారం బయటపడుతోంది.. ఇప్పటి వరకు వేసిన కమిటీలు, నివేదికలపై ప్రభుత్వానికే స్పష్టత కరువైందా.. అన్న విమర్శలు వస్తున్నాయి. స్పష్టంగా వచ్చిన రిపోర్టులపై మరో కమిటీ వేయాల్సినవసరం ఏంటని రాజకీయ నిపుణుల మాట. ప్రతిపక్షాలు కూడా నామమాత్రంగా వాదిస్తున్నాయి కానీ బలమైన గొంతును వినిపించడం లేదు… ఒక వేల ఏకసభ్య కమిటీ కూడా కల్తీ జరగలేదని ఇచ్చిన రిపోర్టులపై జరిగిందని చెప్పేందుకేనేమో అన్న అభిప్రాయాలు ఉన్నాయి.. కేంద్రంలో, రాష్ట్రంలో బలమైన ప్రభుత్వాలు ఉండి కూడా కల్తీ విషయంలో దేశ ప్రజలకు స్పష్టమైన న్యాయం జరగకపోవడం బాధాకరమే… మరో పక్క అసెంబ్లీ సమావేశాలు షురువైనాయి. ప్రతిపక్షాలు, ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడికి తలొగ్గేలా ఉండకూడదని స్వయంగా సీఎం నుంచే ఆదేశాలు వచ్చాయి.. లడ్డూ విషయంలోనూ సమావేశాల్లో డిమాండ్ పెరిగే అవకాశముంది. ప్రస్తుతం ఈ అంశాన్ని కోర్టుకు ఇస్తే మంచిదేమోనని యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. లడ్డూ వ్యవహారం నెల్లూరు ఏసీబీ కోర్టులో ఉంది. ఇలాంటి అంశాన్ని మరింత పెద్దదిగా చేయకుండా కాస్త పక్కన పెట్టాలని, ఇప్పటి వరకు చేసిన పనులనే ప్రజలకు పదేపదేగా చెప్పాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
లడ్డూ వ్యవహారంపై నెల్లూరు కోర్టు, సుప్రీంకోర్టు తేల్చే వరకు మౌనంగా ఉండాలని పార్టీ నాయకులకు, శ్రేణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలపైనే ఫోకస్ చేయాలని సూచించారు. ఇంత పెద్ద వ్యవహారాన్ని ఎన్ని మలుపులు తిప్పినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేనట్లే కనిపిస్తోంది. ప్రతిపక్షాలు, ధార్మిక సంఘాలు ఏదో మొక్కుబడిగా స్పందిస్తున్నారు… వీలైతే రిపోర్టులు వచ్చినప్పుడు, లేదంటే దైవ సన్నిధిలో పరిధిలో వచ్చే రాజకీయ విమర్శలు వచ్చినప్పుడే హాడావుడి తప్ప ఇంకేమీ లేదు. ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ ఈ విషయాన్ని పెద్దదిగా చేయకుండా రిలీఫ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.
పట్టువీడని విక్రమార్కుడిలా వ్యవహరించడం లేదు. లడ్డూ విషయంలో ప్రజలు, నిపుణుల్లో అనేక సందేహాలు… కల్తీ జరిగిందని తేలితే శిక్ష ఖరారు అయితే సరిపోతుంది… ఇక్కడ రిపోర్టులన్నీ కల్తీ లేదనే వస్తున్నాయి. కమిటీల పేరుతో కాలయాపన చేసినంత కాలం లడ్డూపై ఆరోపణ మచ్చ కనిపిస్తూనే ఉంటుంది. సమస్యకు పరిష్కారం దొరకదు. ఇది భక్తులకు పరోక్షంగా ఇబ్బంది కలిగించే అంశమే.. జంతు కొవ్వు, నెయ్యి విషయంలో కల్తీ లేనిది పక్కన పెట్టి.. కల్తీ జరిగిన అంశంలో కఠిన శిక్షలు వెంటనే ఖరారు చేయాలనయన్నది భక్తుల ముఖ్యమైన డిమాండ్. కానీ ఇక్కడ అధికార పక్షం జరిగిందని.. ప్రతిపక్షమేమో జంతు కొవ్వు లేదంటూ రాజకీయ స్వార్థం కోసం హాడావుడి చేసుకుంటున్నాయే తప్ప… ప్రజల మనోభావాలకు ధైర్యాన్ని ఇవ్వడం లేదు. ఒకరునొకరు విమర్శలు చేసుకుంటూ అసలు విషయాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. స్పష్టతను బయటపెట్టి భక్తుల్లో ఉన్న భావోద్వేగ భావనను తొలగించాల్సినవసరం ఎంతైనా ఉంది.
-పట్ట. హరిప్రసాద్,
మొబైల్ : 8790 84 3009





