మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలన్న ఎంపీ ఈటల
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9: కల్తీ కల్లు కేసులో ఐదుగురు నిర్వాహకులను బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కల్లు కాంపౌండ్లు నిర్వహిస్తున్న నగేశ్ గౌడ్, బి.శ్రీనివాస్ గౌడ్, టి. శ్రీనివాస్ గౌడ్, టి.కుమార్ గౌడ్, తీగల రమేశ్‌పై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. నిర్వాహకులకు సంబంధించిన ఐదు షాపులను పోలీసులు సీజ్ చేశారు. మొత్తం 600 లీటర్ల కల్లు స్వాధీనం చేసుకున్నారు. కల్లు కాంపౌండ్‌లో మంగళవారం కల్తీ కల్లు తాగి 19 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సీతారాం (47) బుధవారం మృతి చెందగా ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో స్వరూప అనే మహిళ ప్రాణాలు విడిచారు. అంత్యక్రియల కోసం ఆమె మృతదేహాన్ని తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకున్నారు. కల్తీ కల్లు తాగి చనిపోయినట్లు తేలడంతో పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. మరో 15 మంది పంజాగుట్ట నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా, కల్తీ కల్లు తాగి మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి పరిహారం ఇవ్వాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిజాలు దాచాలని చూస్తోందని ఆరోపించారు. ఈ ఘటనలో ఇవాళ ఒకరు, నిన్న ఇద్దరు.. మొత్తం ముగ్గురు చనిపోయినట్లు సమాచారం ఉందని చెప్పారు. కల్తీ కల్లు ఎప్పటినుంచి అమ్మారు..ఎంతమంది తాగారు అనే పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం సేకరించాలన్నారు. బాధితులు 20 మంది కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉందన్నారు. ఇప్పుడిప్పుడే మరికొందరు హాస్పిటల్‌లో చేరుతున్నారని వివరించారు.
కల్తీకల్లు ఘటనలో మరొకరు మృతి




