– కార్పొరేట్ సంస్థలకు మంత్రి జూపల్లి పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12: పర్యాటకం కేవలం ఆదాయ వనరు మాత్రమే కాదని, వారసత్వం, ప్రాచీన సంస్కృతిని మన ముందు ఆవిష్కరిస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శిల్ప కళా వేదికలో బుధవారం నిర్వహించిన దక్షిణ భారత అతిపెద్ద సీఎస్‌ఆర్ సమ్మిట్ రెండో ఎడిషన్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంపవరింగ్ ఛేంజ్, బిల్డింగ్ టుమారో అనే అంశం ఈ సమ్మిట్‌కు సరైన ఆత్మగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు మన రాష్ట్రానికి వస్తున్నారు.. మన సంప్రదాయాలు, పండుగలు, హస్తకళలు, వంటకాలు ప్రపంచవ్యాప్తంగా పేరుపొందాయి.. పర్యాటకం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది.. స్థానిక కళాకారులు, నేతకారులు, చిన్న వ్యాపారులు ఉపాధి పొందుతున్నారు అని మంత్రి తెలిపారు. కార్పొరేట్ విజయాన్ని సామాజిక ప్రగతితో కలిపే వారధి సీఎస్‌ఆర్ అంటూ వారసత్వ కట్టడాల సంరక్షణ, యువత నైపుణ్యాభివృద్ధి, సంప్రదాయ కళల ప్రోత్సాహం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో ఇది కీలకంగా నిలుస్తుంది అని వివరించారు. అన్ని సంస్థలు ఒక్కో పర్యాటక ప్రదేశాన్ని దత్తత తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఇది కేవలం ఆర్థిక సహకారం కాదు.. బాధ్యతతో కూడిన భాగస్వామ్యం. ప్రభుత్వం కూడా దత్తత తీసుకున్న సంస్థలకు తగిన గుర్తింపు ఇస్తుంది అని చెప్పారు. ఈ సమ్మిట్‌లో 300కుపైగా కార్పొరేట్ సంస్థలు, 100 ఎన్‌జీఓలు పాల్గొనడం గర్వకారణమన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వినిల్ రెడ్డి నాయకత్వాన్ని ఆయన అభినందించారు. అలాగే ‘బచ్పన్ బచావో’ సంస్థను కమ్యూనిటీ పార్ట్‌నర్‌గా ఎంపిక చేసినందుకు ప్రశంసించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





