– కేంద్ర మంత్రికి అడ్లూరి వినతి
న్యూదిల్లీ, ఆగస్టు 7: వికలాంగులకు పెన్షన్ రూ.300 నుంచి రూ.3వేలకు పెంచాలని, పెన్షన్ అర్హతను 80 శాతం నుండి 40శాతానికి తగ్గించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల, వయో వృద్ధుల, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ దిల్లీలో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్రకుమార్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. బాల్యం నుంచే వికలాంగులకు పెన్షన్ ఇవ్వాలని, వారికిచ్చే ఉచిత పరికరాలు 40శాతం బెంచ్ మార్క్ వైకల్యంకే ఇవ్వాలని కోరారు. వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్యతో కలిసి కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేశారు. వికలాంగుల సంక్షేమంలో పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా 18 సంవత్సరాల నుండి 79 సంవత్సరాల వరకు ఉన్న వికలాంగులకు రూ.300లు, 80శాతంష్ట్రÊ ఆ పైన ఉన్న వికలాంగులకు రూ. 500 పెన్షన్ ఇస్తున్నారని, 2014 నుండి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి కూడా పెంచలేదని గుర్తు చేశారు. పెన్షన్ కనీసం రూ.3000లకి పెంచాలని కోరారు. 40 శాతం బెంచ్ మార్క్ వైకల్యం వారు అన్ని సంక్షేమ పథకాలకు అర్హులని, రాష్ట్రంలో 40శృాతానికే పెన్షన్ ఇస్తున్నామని, వికలాంగులుగా పుట్టగానే వైకల్య ధ్రువీకరణ పత్రం ఇచ్చి రూ.4016 పెన్షన్ ఇస్తున్నామని, త్వరలోనే ఈ పెన్షన్ రూ.6000కి పెంచుతాం అని, కేంద్రం కూడా తెలంగాణని రోల్ మోడల్‌గా తీసుకుని మార్పులు చేయాలని కోరారు. తెలంగాణలో వికలాంగుల కార్పొరేషన్ ద్వారా అందించే ఉచిత సహాయ ఉపకరణాలు దేశంలో ఎక్కడా లేని విదంగా 40శాతం వైకల్యానికే ఇస్తున్నామని, కేంద్రం కూడా 40శాతం వైకల్యానికే వికలాంగుల పరికరాలు ఇవ్వాలని కోరారు, కార్యక్రమంలో కాంగ్రెస్ చేనేత విభాగం చైర్మన్ గూడూరి శ్రీనివాస్, పెరిక కుల కార్పొరేషన్ సాధన సమితి అసోసియేట్ ప్రెసిడెంట్ కోట మల్లికార్జున్ రావులు పాల్గొన్నారు.
ఎస్సీల సంక్షేమానికి కేంద్ర సాయం విడుదల చేయండి
రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్యతో కలిసి కేంద్ర మంత్రి రాందాస్ అథవాలేతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సంబంధించి రాష్ట్రానికి కేంద్ర సహాయం తక్షణం విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పీసీఆర్/పీవోఏ చట్టాల అమలుకు రూ.232.68 కోట్లు (బకాయిలతో కలిపి), పీఎం-అజయ్ పథకం కింద 2025-26 సంవత్సరానికి రూ.82.20 కోట్లను కేంద్రం విడుదల చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రం తన వాటాను చెల్లించిందని, కేంద్ర వాటా ఇప్పటివరకు విడుదల కాలేదని మంత్రి తెలిపారు. ఈ నిధుల విడుదల వల్ల ఎస్సీ వర్గాల న్యాయం, సాధికారత, అభివృద్ధి మరింత బలోపేతం అవుతుందన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల కోసం కేంద్ర ఆర్థిక సాయం కోరారు.





