– ఆదివాసీ అమరవీరులకు నివాళులర్పించిన గిరిజన నాయకులు, అధికారులు
భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్టు 9: ఆదివాసీలు (Adivasi) అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్య సదుపాయాలు కల్పించేందుకు ఐటీడీఏ ముందు ఉందని, మరిన్ని సంక్షేమ పథకాలను వారికి ఐటీడీఏ ద్వారా అందిస్తున్నామని ఐటీడీఏ పీవో రాహుల్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో(Bhadrachalam) ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఐటీడీఏ అధికారులు, ఆదివాసీ సంఘం నాయకులు భద్రాచలంలో ఘనంగా నిర్వహించారు. ఆదివాసీల సంప్రదాయాలైన రేలా, కొమ్ము నృత్యాలతో పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్‌లోని ఆదివాసీల అమరవీరులు మల్లు దొర, ఘట్టం దొర, అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు కలెక్టర్ జితేష్ బి.పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఆదివాసీ సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆదివాసీ జెండాను పీవో రాహుల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులతోపాటు ఆదివాసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




