ఫోన్‌ ట్యాపింగ్‌ చేసిందే మీరు

– తప్పులను కప్పిపుచుకునేందుకు సీఎంపై నిందలా?
– బీఆర్‌ఎస్‌ తీరుపై ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మండిపాటు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24: ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ నేతలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని, ఆ అవసరం తమ నాయకుడు, సీఎం రేవంత్‌రెడ్డికి లేదని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. తాము చేసిన పనులు ఇతరులు కూడా చేస్తారని బీఆర్‌ఎస్‌ నేతలు భ్రమిస్తున్నారని మండిపడ్డారు. తమ హయాంలో చేసిన ఫోన్‌ ట్యాపింగ్‌పై సమాధానం చెప్పాలన్నారు. వారి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కొత్త డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. గాంధీ భవన్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం.. తమ మంచి పాలనను ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ ప్రతిపక్ష పాత్ర కూడా సరిగా నిర్వహించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే జరుగుతుందన్నారు. ఫామ్‌హౌస్‌కే పరిమితమవుతూ విమర్శించడం సరికాదన్నారు. మీలా ట్యాపింగ్‌తో రాజకీయాలు చేయాల్సిన అవసరం తమ ముఖ్యమంత్రికి లేదని, తమకు తమ నాయకుల మీద నమ్మకం, విశ్వాసం ఉందని అన్నారు. గత ప్రభుత్వంలో భార్యాభర్తలు, సినీ తారలు, జడ్జిలు మాట్లాడిన కాల్స్‌ ట్యాప్‌ చేశారని ఆది ఆరోపించారు. ఇవన్నీ త్వరలోనే బట్టబయలవుతాయంటూ వీటికి సమాధానం చెప్పాలని నిలదీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *