మెయిల్ వచ్చింది. చూశాను. వార్నింగ్. గత కొన్నిరోజులుగా యిచ్చిన వార్నింగే యిస్తోంది. మీకున్న ఫిఫ్టీన్ జీబీలో నైన్టీ పర్సెంటు వాడేశారని. ఫోన్ గేలరీలో పిక్చర్స్, ఆల్బమ్స్, స్టోరీస్ యింకా ఫోటోలు, వీడియోలూ అన్నీ డిలిట్ చెయ్యమని మా అబ్బాయి సలహా యిచ్చాడు. లేదూ ఫోన్లో వున్నవన్నీ ఇంపార్టెంటే అనుకుంటే అవి అలాగే వుంచి ఎక్స్ట్రా జీబీ గూగుల్ వాడి దగ్గరే రెంటుకు తీసుకోండి అని కూడా మార్గం చెప్పాడు.
ఆ మాట మా ఆవిడ వింది. వంద వాట్సప్ గ్రూపులూ వెయ్యిన్నర కాంటాక్ట్సూ, యేమవుతుంది ఆ వాట్సప్ నిండిపోక? అని నిష్టూరమాడిరది. నిజమే, ఓల్డ్ స్టూడెంట్స్ గ్రూపులూ ఫ్రెండ్స్ గ్రూపులూ ఫ్యామిలీ గ్రూపులూ ఎంప్లాయ్ గ్రూపులూ యూనియన్ గ్రూపులూ కల్చర్ అండ్ స్టడీ గ్రూపులూ యోగా అండ్ హెల్త్ గ్రూపులూ అపార్ట్మెంటు అసోసియేషన్ గ్రూపులో గ్రూపులూ యింకా ఎవరెవరో తగిలించిన గ్రూపులూ మొహమాటానికి కాదనలేని గ్రూపులూ.
వాట్సప్ గ్రూపుల్లోంచి బయటకు వచ్చేస్తే, పొరపాటున వెళ్ళిపోయినట్టున్నారని వాళ్ళే అనేసి మళ్ళీ వాళ్ళే తగిలించడమో లేదూ అలిగి మాట్లాడ్డం మానెయ్యడమో, కొత్త తలనొప్పులు. క్లియర్ చాట్ చెయ్యండి ఆల్ డిలిట్ ఆప్షన్ టిక్ చేస్తే మొత్తం క్లియర్ అయిపోతాయి అని చెప్పాడు మావాడు. ఇందులో పనికోచ్చినవీ పనికిరానివీ అన్నీ పోతాయా అంటే, దానికి తెలీదు కదా యేవి పనికొచ్చేవో పనికిరానివో అన్నాడు. ఒక్కోటి డిలిట్ చేసుకోండి అన్నాడు. డిలిట్ చేస్తూనే వున్నా, చేసిన కొద్దీ నిండిపోతున్నాయి. రోజూ చెత్త వేస్తే డస్ట్‌బిన్ నిండిపోదా అని మా ఆవిడ. ఆవిడ డస్ట్‌బిన్ అన్నది ఫోన్నా లేక తలనా? ఏమో? ఫోను ఆపరేట్ చేసి చేసి నా చూపుడువేలు అరిగి పొట్టిదయిపోయిందని కూడా నవ్వింది.
ఇప్పుడు కళ్ళు సరే వేలూ నొప్పెడుతోంది. డిలిట్ చేసి చేసి. ఎవర్నైనా పెట్టండి, డిలిట్ చెయ్యడానికి అని మా ఆవిడ పంచ్‌లు వేస్తూనే వుంది.
ఏమిటో వున్నట్టుండి ఫోన్లో డిలిట్ చేస్తే డిలిట్ కావడం లేదు. ఇంట్లో చెప్తే తిట్లు కాయాలని చెప్పకుండా మొబైల్ షాప్ వాడి దగ్గరకు వెళ్ళి చూపించాను. చూపించండి అన్నాడు షాపువాడు. డెమో చేసి చూపించాను. షాపువాడు నోరు తెరచుకు చూశాడు. గిల్లడం కాదు చిక్కి ముక్క తీసేస్తే కాని తేరుకోలేదు. తేరుకొని యేడుపు ముఖం పెట్టుకొని అన్నాడు. ‘సార్! మీరు వాట్సప్‌లోవి కాదు, ఫేస్‌బుక్‌లో డిలిట్ చెయ్యాలని చూస్తున్నారు!’
-బమ్మిడి జగదీశ్వరరావు





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల