రాష్ట్రంలో సరిపడా యూరియా నిల్వలు

– ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టికే 5.44 లక్షల మెట్రిక్ టన్నుల స‌ర‌ఫ‌రా
– 5 జిల్లాల్లో ఫెర్టిలైజర్ యాప్ ప్రయోగం స‌క్సెస్‌
– యూరియా స‌ర‌ఫ‌రాలో ఇబ్బందులు రావ‌ద్దు
– కలెక్టర్లతో మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 29: రాష్ట్ర రైతులకు రబీ సీజన్‌ కోసం అవసరమైనంత యూరియా నిల్వ ప్రభుత్వం వద్ద పూర్తిగా అందుబాటులో ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఫెర్టిలైజర్ (యూరియా) యాప్, యూరియా పంపణీలపై చీఫ్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీలతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ రబీకి కేంద్ర ప్రభుత్వం మొత్తం 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించగా, అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు రావాల్సిన 5.60 లక్షల మెట్రిక్ టన్నులకు గాను 5.70 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నాయని వివరించారు. గత ఏడాది ఇదే సమయానికి 2.81 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరగగా ఈ సీజన్‌లో రోజుకు సగటుగా 8,692 మెట్రిక్ టన్నుల చొప్పున మొత్తం 3.72 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రైతులు కొనుగోలు చేశారని, ఇది గత సీజన్ కంటే 92 వేల మెట్రిక్ టన్నులు అధికం అని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.15 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వగా ఉన్నట్లు తెలిపారు. ఫెర్టిలైజర్ (యూరియా) యాప్ ను ఆదిలాబాద్, మహబూబ్ నగర్, జనగామ, నల్లగొండ, పెద్దపల్లి జిల్లాల్లో డిసెంబర్ 20 నుండి అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ఈ ఐదు జిల్లాల్లో 82,059 మంది రైతులు యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసి 2,01,789 బస్తాలు కొనుగోలు చేశారు. యాప్ ప్రారంభించిన కేవలం 9 రోజుల్లోనే ఈ జిల్లాల్లో రోజుకు 22వేల‌కు పైగా బస్తాలు పంపిణీ అయిన‌ట్లు తెలిపారు. యూరియా యాప్ అమలులో ఉన్న జిల్లాల కలెక్టర్లతో మంత్రి మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అప్పుడప్పుడు కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరిస్తున్నారని, రైతులు కూడా యూరియా యాప్ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. యాప్ అనేది కేవలం రైతుల సౌకర్యార్థం తెచ్చినది మాత్రమే, దీని ద్వారా యూరియా అమ్మకాలు పారదర్శకంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఇప్పటికే కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు పత్తి అమ్మకాలు సులభంగా చేసుకోగలుగుతున్నారని, అదే దిశలో ఈ యాప్ ని తీసుకొచ్చామ‌న్నారు. యాప్ అమలులో ఉన్న జిల్లాలు కాని, అమలులో లేని జిల్లాల్లో కాని యూరియా సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. జిల్లాల వారీగా యూరియా స్టాక్, డిమాండ్, పంపిణీపై కలెక్టర్లు నిశితంగా పర్యవేక్షించాలని, అవసరమైతే అదనపు సేల్స్ పాయింట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. యూరియా పంపిణీపై మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను నియమించాల్సిందిగా సూచించారు. యూరియా పంపిణీలో ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించాలని, పర్యవేక్షణలో ఎటువంటి అలసత్వం ఉండకూడదన్నారు. రాష్ట్రంలో యూరియా లభ్యతపై రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం దగ్గర రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని మంత్రి స్పష్టం చేశారు. రైతుల సౌకర్యార్థం వ్యవసాయ కమిషనరేట్ లో టోల్ ఫ్రీ నెం. 18005995779 ఏర్పాటు చేశామ‌ని తెలియజేశారు. అనంతరం చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలు ఉదయాన్నే తెరిచేలా చర్యలు తీసుకోవాలని, స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు తెప్పించుకొని, సాయంత్రం జిల్లా అధికారులతో సమీక్షించాలని, రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్  మాట్లాడుతూ ప్రతి పీఏసీఎస్‌ లో మూడునాలుగు కౌంటర్లు ఏర్పాటు చేయాలని, రైతుల సౌకర్యం కోసం షామియానా, తాగునీరు లాంటి సదుపాయాలు అందుబాటులో ఉంచాలని అన్నారు. సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, మార్క్ ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి, కోఆపరేటీవ్ అడిషనల్ రిజిస్ట్రార్ చంద్రమోహన్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *