– కండువా కప్పి స్వాగతించిన రామచందర్‌రావు
– ఆమెతోపాటు మేకప్ ఉమన్ శోభలత కూడా..
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: ప్రముఖ సినీ నటి ఆమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో శనివారం చేరారు. రామచందర్ రావు పార్టీ కండువా కప్పి ఆమెను సాదరంగా స్వాగతించారు. ఆమె సహచరురాలు, ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్, నంది అవార్డు గ్రహీత శోభలత కూడా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో మహిళలకు మేకప్ ఉమన్‌గా పనిచేసే అవకాశం లేని సమయంలో శోభలత న్యాయపోరాటం చేశారు. ఫలితంగా సినీ ఇండస్ట్రీలో మహిళలు మేకప్ ఆర్టిస్టులుగా పనిచేయవచ్చనే నిర్ణయం తీసుకున్నారు. మహిళల హక్కుల కోసం పోరాడిన ఆమె కృషి అభినందనీయమంటూ శోభలత పార్టీలో చేరడం గర్వకారణమని అన్నారు. ఆమని తన ప్రతిభ, వైవిధ్యమైన నటనతో తెలుగు సినీ పరిశ్రమపై చెరగని ముద్ర వేశారన్నారు. ఆమె తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమలలో ప్రముఖ నటులతో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో విశేషమైన స్థానం సంపాదించారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలనతో ఆకర్షితులై తాము కూడా దేశ సేవ చేయాలనే భావనతో వారు బీజేపీలో చేరారని ఆయన చెప్పారు. గతంలో బీజేపీ నగరాలకు మాత్రమే పరిమితమైందని విమర్శించిన వారి కళ్లు తెరుచుకునేలా గ్రామీణ ప్రాంతాల్లోనూ బీజేపీ బలం పెరుగుతోందని పంచాయతీ ఫలితాలు స్పష్టం చేశాయన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలన్నా, అవినీతి అంతం కావాలన్నా, ప్రజలకు ప్రభుత్వ పథకాలు సమగ్రంగా, పారదర్శకంగా అందాలన్నా డబుల్ ఇంజిన్ సర్కారు అత్యవసరమని రామచందర్‌రావు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీని ఆదరించి, అత్యధిక సంఖ్యలో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతంరావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ, పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జి ఎన్.వి.సుభాష్, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





