– ఏవోయూలో “దక్షిణాది భాషలు – అస్తిత్వం -రాజకీయాలు” సదస్సు
– దక్షిణ ప్రాంత భాషలపై దాడి: ప్రకాశ్‌రాజ్
– ఈ ప్రాంతంలో బలమైన ప్రాంతీయ భాషలు: కె.శ్రీనివాస్
– మాతృ భాషలోనే ఆలోచనలు పంచుకోవాలి: డాక్టర్ మీనా కందస్వామి
– నిధుల కేటాయింపులో అన్యాయం: ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబరు 19 : భిన్న సంస్కృతుల దేశంలో ఓకే భాష పేరుతో ప్రజల మధ్య జాతీయవాదం వైషమ్యాలు సృష్టిస్తోందని ప్రముఖ తెలుగు నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్‌రాజ్ అన్నారు. హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అధ్యక్షతన దక్షిణ భారత భాషలు -అస్తిత్వం -రాజకీయం అనే అంశంపై శుక్రవారం జాతీయ సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ జాతీయవాదం మీద పరోక్షంగా నిప్పులు చెరిగారు. దేశంలోని ప్రజల భిన్న సంస్కృతీ సంప్రదాయాలను పాలకులు గౌరవించాలని కోరారు. తనకు ఉత్తర, దక్షిణ భారతదేశ ప్రజలు మాట్లాడే అన్ని భాషల పట్ల గౌరవం అభిమానం ఉందని చెప్పారు. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా వారిమీద పరాయి భాషను బలవంతంగా రుద్దే విధానం సరైంది కాదని స్పష్టం చేశారు. ప్రజలు తమ అవసరాలకనుగుణంగా భాషను నేర్చుకుంటారని చెప్పారు. తాను ఏడు భాషలు మాట్లాడగలనని , ఆ భాషల్లో నటించగలుగుతున్నానని పేర్కొన్నారు. ఆధిపత్య స్వభావం గల పాలకులు తమ భాషనే మాట్లాడాలని ప్రజల్ని బలవంతపెట్టడం సరైంది కాదని ఆయన చెప్పారు. విభిన్న సంస్కృతి, సంప్రదాయాలు కలిగిన దేశీయ అంతఃసారాన్ని పాలకులు గ్రహించాలని సూచించారు. ప్రజలు తమ అస్తిత్వాన్ని నిలబెట్టిన భాషను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరని చెప్పారు. దక్షిణాది ప్రాంతీయ భాషలపై దాడి జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. భాషను కాపాడుకోవడానికి దక్షణాది రాష్ట్రాల్లో సదస్సులు విరివిగా జరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దేశంలో భిన్న భాషలు, భిన్న ప్రాంతాలు, భిన్న మతాలు ఉన్నా మన దేశం చాలా గొప్పదని కొనియాడారు. కొందరు తమదే గొప్ప పురాతన భాషంటూ ఇతర భాషలను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తర భారతంలో కొన్ని రాష్ట్రాలకు హిందీ మాత్రమే వచ్చన్నారు. వారికి ఇతర భాషలు రావన్నారు. దీంతో వాళ్లు దక్షిణాది ప్రజలపై హిందీ బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తురన్నారు. ఇతర ప్రాంతాల నుంచి సంపాదించుకోవడానికి వచ్చి తమ భాష, సంస్కృతిని దెబ్బతీయాలని చూస్తే ఉపేక్షించేది లేదని ప్రకాష్ రాజు హెచ్చరించారు. మన భాష, మన సంస్కృతి, మన ధ్వని, మన గర్వం, మన అస్తిత్వం దెబ్బ తీయాలని చూస్తే వూరుకునేదిలేదని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో ఉనికిని వదులుకోమన్నారు. తాము ఇతరులను గౌరవిస్తాం.. మమ్మల్ని గౌరవించకపోతే ఎలా గౌరవించాలో కూడా నేర్పుతామని ప్రకాష్ రాజ్ అన్నారు.
దక్షిణ భారతానికి భాషా సమాఖ్యవాదం, సాంస్కృతిక విశ్వాసం : కె.శ్రీనివాస్
సీనియర్ సంపాదకులు, రచయిత డాక్టర్ కె. శ్రీనివాస్ కీలకోపన్యాసం చేశారు. దక్షిణ భారతానికి భాషా సమాఖ్యవాదం, బలమైన ప్రాంతీయ భాషలు, సాంస్కృతిక విశ్వాసం ఉందన్నారు. హిందీ జాతీయవాద ఆధిపత్యానికి ప్రతిఘటన అదో విజయగాథగా ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. దక్షిణ భారత భాషా రాజకీయాలను జాతీయ రాజ్యాంగం చారిత్రక చట్రం సందర్భంలో అర్థం చేసుకోవాలన్నారు. దేశంలో భాష కేవలం ఒక అస్తిత్వంగా కాకుండా రాజకీయ మౌలిక సదుపాయంగా పనిచేస్తుందన్నారు. విద్య, అధికారాన్ని అందుకోవడానికి భాష బాటలు వేస్తుందన్నారు.
ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త డాక్టర్ మీనా కందసామి విశిష్ట అతిథిగా మాట్లాడుతూ మన ఆలోచనలను మాతృభాషలో పంచుకున్నప్పుడే ప్రజ్వరిల్లుతాయనన్నారు. అదే విషయాలను ఆంగ్లంలో లేదా ఇతర భాషల్లో చెప్పినప్పుడు వివాదాల నుండి తప్పించుకోవన్నారు. భాష కోసం నిలబడటం, స్వీయ అస్తిత్వం -నిర్ణయాధికారం కోసం ప్రజలు పోరాడుతారన్నారు. భాష, సంస్కృతి పరిరక్షణ కోసం ప్రత్యేక తమిళ ఈలం విముక్తి ఉద్యమం చరిత్రలో ఉందని మీనా కందసామి అభిప్రాయపడ్డారు. ఈ ఉద్యమంలో మహిళలు కూడా భాగమని గుర్తించాలన్నారు. విముక్తి పులుల్లో మూడింట ఒక వంతుమంది మహిళలే ఉన్నారన్నారు. తమ మాతృభూమిని తిరిగి పొందేందుకు మహిళలు ఆయుధాలు చేపట్టారని గుర్తు చేశారు. తమ భాష కోసం వారు ఎంత దూరం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారో చరిత్ర నిరూపించిందన్నారు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ చక్రపాణి మాట్లాడుతూ ఉత్తర భారతానికి మేం వ్యతిరేకం కాదన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు భాషపై, సాంస్కృతిక దాడిపై, ప్రజల జీవన విధానాలపై, నిధుల కేటాయింపుల్లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించగలమని స్పష్టం చేశారు. ప్రకాష్ రాజ్ కేవలం నటుడే కాదు.. గొప్ప రచయిత, నిర్మాత, దర్శకుడు, దక్షిణాది రాష్ట్రాల సాంస్కృతిక వారధిగా గుర్తింపు ఉన్న వ్యక్తి అంటూ ప్రశంసించారు. మొదటి సెషన్‌లో జిలుకర శ్రీనివాస్ (తెలుగు), అరవింద్ వారియర్ (మలయాళం), ప్రొఫెసర్ తారకేశ్వర్ (కన్నడ), ప్రొఫెసర్ పార్థసారధి (తమిళం) ప్రాంతీయ భాషలు, ఎదుర్కొంటున్న పరిస్థితులు, భాషా పరిరక్షణ కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సెషన్ కు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ అధ్యాపకుడు పిల్లలమఱ్ఱి రాములు అద్యక్షత వహించారు. రెండో సెషన్‌లో హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ అధ్యాపకులు ప్రొఫెసర్ పార్ధసారథి, రచయిత, పాత్రికేయులు, ప్రఖ్యాత విమర్శకులు ఎన్. వేణుగోపాల్, తిరుపతి ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ పి. సి. వెంకటేశ్వర్లు (అంతర్జాలం ద్వార) దక్షిణాది భాషలు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులు, దక్షణాది రాష్ట్రాల ప్రజలపై ఉత్తరాది బాషల అజమాయిషీని వివరించారు. ఉత్తరాది భాషలను బలవంతంగా దక్షణాది రాష్ట్రాలపై రుద్దే ప్రయత్నంపై సమగ్రంగా చర్చించారు. ఈ సెషన్ కు సురవరం ప్రతాప రెడ్డి తెలుగు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ నిత్యానంద రావు అద్యక్షత వహించారు. ముగింపు సమావేశంలో బుక్ బ్రహ్మ (బెంగళూరు) డైరెక్టర్ సతీష్ చప్ప్రీకే, యూనివర్సిటీ అకాడమిక్ డైరెక్టర్ జి.పుష్పా చక్రపాణి అధ్యక్షత వహించగా రిజిస్ట్రార్ ఎల్.విజయ కృష్ణారెడ్డి మాట్లాడారు. ఆర్ట్స్ విభాగ డీన్ కె.రాణి రజిత మాధురి, సెమినార్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్. రజని, పిఆర్ఓ డాక్టర్ పెసర వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ బర్ల మహేందర్, డాక్టర్ అనంత శంకర్ పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





