– బెట్టింగ్ యాప్‌ల కేసులో
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30: బెట్టింగ్ యాప్‌ల కేసులో ఈడీ విచారణకు సినీ నటుడు ప్రకాష్‌రాజ్ హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్టు అనుమానిస్తూ నిందితులుగా ఉన్న పలువురు సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు ప్రకాశ్‌రాజ్ వచ్చారు. దుబాయ్‌కి చెందిన బెట్టింగ్ యాప్స్ నుంచి లావాదేవీలు జరిగినట్లు గుర్తింని ఐదు సంవత్సరాల అవాదేవీలను పరిశీలించినట్లు తెలుస్తోంది. సినీ ప్రముఖులకు బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన సొమ్మును దుబాయ్‌లోనే పెట్టుబడులు పెట్టినట్లు అనుమానిస్తున్నారు ఈడీ అధికారులు. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై పంజాగుట్ట, మియాపూర్, సూర్యాపేట, విశాఖలో నమోదైన కేసుల ఆధారంగా విచారణ కొనసాగిస్తోంది. మొత్తం 29మంది సినీ నటులు, యూట్యూబర్లు, ఇన్‌ప్లుయెన్సర్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ పోలీసుల నుంచి ప్రాథమిక దర్యాప్తు వివరాలను ఈడీ సేకరించింది. ప్రమోషన్లు చేసినందుకు బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు హవాలా మార్గంలో పలువురికి డబ్బు పంపించారనే కోణంలో ఆరా తీస్తోంది.
బెట్టింగులతో డబ్బులు సంపాదించాలనుకోవద్దు
బెట్టింగ్ యాప్స్‌తో డబ్బులు సంపాదించాలని ఎవరూ ఆశపడవద్దని సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ సూచించారు. ఆయన్ను ఐదు గంటలపాటు ఈడీ విచారించిన అనంతరం బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడారు. బెట్టింగ్ యాప్స్ ప్రచారం వ్యవహారంలో నిర్వాహకుల నుంచి తనకు డబ్బులు అందలేదన్నారు. మళ్లీ ఆ యాప్‌లకు ప్రచారం చేయనన్నారు. ఈడీ అధికారులు తాను చెప్పిన విషయాలను నమోదు చేసుకున్నారని, మరలా విచారణకు పిలవలేదని చెప్పారు.





