మోసం చేస్తున్న సీడ్ కంపెనీల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి: కే.టి.ఆర్‌. డిమాండ్‌

– గ‌ద్వాల రైతుల‌కు సీడ్ కంపెనీల వేధింపులు
– రైతులు పండిచిన విత్త‌నాల‌ను నాసిర‌క‌మంటున్న కంపెనీలు
– కంపెనీల మోసాల‌ను అరిక‌ట్టాల‌ని రైతుల డిమాండ్‌

  గద్వాల జిల్లాలో రైతులను మోసం చేస్తున్న సీడ్ కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు డిమాండ్ చేశారు. రైతులు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేలా కంపెనీలతో చర్చించి తగిన న్యాయం చేయాలన్నారు. సీడ్ కంపెనీల అక్రమాలతో మోసపోయిన గద్వాల జిల్లా రైతులు హైదరాబాద్ నందినగర్ లో కేటీఆర్ ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. సీడ్ కంపెనీలు చేసిన మోసంతో  ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. సీడ్ కంపెనీలు నేరుగా తమకు విత్తనాలను ఇవ్వకుండా ఆర్గనైజర్లు అనే దళారులను నియమించుకొని మాఫియాగా వ్యవహరిస్తున్నాయని కేటీఆర్ కు తెలిపారు. ఈ సంవత్సరం తాము పండించిన సీడ్ ను గత సంవత్సరం కంటే తక్కువ ధరకు కొంటామని ఆర్గనైజర్లు, కంపెనీలు కొత్త మోసానికి తెరతీశాయని ఆరోపించారు.
ఇంతేకాదు తాము పండించిన సీడ్ నాణ్యమైనద‌యినప్పటికీ నాసిరకమంటూ, ల్యాబ్ టెస్ట్ లో ఫెయిల్ అయిందని అబద్దాలు చెపుతూ తమ డబ్బులు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కంపెనీలు తాము సొంతంగా పెట్టుకున్న జీఓటీ  నిబంధనల ప్రకారం సీడ్ ను టెస్ట్ చేసి ఆ పంట ఫెయిల్ అయిందని చెపుతున్నారన్నారు. కానీ తాము పండించిన పత్తి విత్తనాలను ప్రయివేట్ ల్యాబ్ లో టెస్ట్ చేపిస్తే పాస్ అయినట్టు తేలిందన్నారు. అన్నదాతల ఆవేదనను సావధానంగా విన్న కేటీఆర్, వెంటనే గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ తో ఫోన్ లో మాట్లాడారు. సీడ్ కంపెనీల అక్రమాలను అడ్డుకోవాలని సూచించారు. ఆయా కంపెనీలతో చర్చలు నిర్వహించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చర్చల కోసం తమ పార్టీ నేత విజయ్ కుమార్ కురువను ప్రత్యేకంగా పంపిస్తున్నానని కలెక్టర్ సంతోష్ కు తెలిపారు. తమ బాధ చెప్పుకున్న వెంటనే స్పందించి కలెక్టర్ తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేసిన కేటీఆర్ కు రైతులు ధన్యవాదాలు తెలిపారు.
ప్రభుత్వానికి జోగులాంబ గద్వాల జిల్లా పత్తి రైతుల డిమాండ్లు
ఆర్గనైజర్లతో కాకుండా ప్రభుత్వ వ్యవసాయ శాఖనుంచి సీడ్ కంపెనీలు రైతులకు విత్తనాలను పంపిణీ చేయాలి.  రైతులు పండించిన సీడ్ పత్తి విత్తనాలను ప్రభుత్వ వ్యవసాయ శాఖ ల్యాబ్ లోనే పరీక్షలు నిర్వహించి ఫలితాలను ధృవీకరించాలి. జిల్లాలోని సీడ్ కంపెనీలు ఉద్దేశపూర్వకంగా ఫెయిల్ చేసిన ప్రతి రైతు సీడ్ పత్తి విత్తనాల శాంపిళ్ల‌కు   ప్రభుత్వ వ్యవసాయ శాఖ ల్యాబ్ లలోనే  పరీక్షలు నిర్వహించి వాస్తవ ఫలితాలను రైతులకు ఇవ్వాలి. సీడ్ కంపెనీలు రైతులకు పంట పెట్టుబడికి ఇచ్చిన మొత్తానికి ఆర్గనైజర్లు వడ్డీని వసూలు చేయరాదు.
గత సంవత్సరంలో ఏ రకంగా ఐతే ప్రతి ప్యాకెట్ కు ధర ఇచ్చారో ఈ సంవత్సరం కూడా అదే ధరను చెల్లించాలి.సీడ్ పత్తి సాగు చేసే రైతులకు జిల్లా స్థాయిలో కలెక్టర్, జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సీడ్ కంపెనీలతో ఒప్పందం కుదిరించి రైతులకు గ్యారెంటీ ఇచ్చి నమ్మకం కల్పించాలి. డీఎన్ ఏ ఫింగర్ ప్రింట్ చూపించి మోసం చేసిన అన్ని సీడ్స్ కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఆయా కంపెనీలనను నిషేధించాలి. రైతులకు రావలసిన పంట డబ్బులు ఇప్పించాలి. తెలంగాణలోని జిల్లాలలో సీడ్ ఉత్పత్తి జరిగే మండలాలలో మండల వ్యవసాయ అధికారి దగ్గర సీడ్ ఉత్పత్తి చేసే కంపెనీల,రైతుల వివరాలు వుండాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *