– ముఖ్య కార్యదర్శులకు సీఎస్ సూచన
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులను రాబట్టుకునేందుకు తగిన కార్యాచరణను రూపొందించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. సచివాలయంలో వివిధ విభాగాల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో సోమవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. కేంద్ర ప్రాయోజిత పథకాల నుండి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, నిధులు మార్చి నెలాఖరులోగా సమీకరించుకునేందుకు ప్రణాళికాబద్దంగా పనిచేయాలన్నారు. ఎసఎనఎ నిధులు, 15వ ఆర్థిక సంఘం గ్రాంట్స్, ఇతర పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రత్యేక దృష్టి సారించి, దిల్లీలో ఒక ప్రత్యేక అధికారిని నియమించుకొని సమన్వయం చేసుకోవాలని తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, విద్య, వైద్యారోగ్య, గిరిజన సంక్షేమ శాఖల వారీగా కేంద్రం నుంచి సుమారు రూ.15 వేల కోట్లు రావాల్సి ఉందని, వీటిని సమీకరించుకొని రాష్ట్రంలోని పెండింగ్ పనులకు ఖర్చు చేయాలని సూచించారు.
వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మార్చి 2, 3 నుండి జూన్ 2వ తేదీ వరకు వివిధ అభివృద్ధి పనులపై వివిధ శాఖల వారీగా వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సిఎస్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, హెల్త్, ఎడ్యుకేషన్ విభాగాలలో ఈ ప్రణాకను సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిసినందున ఎన్నికైన వార్డు మెంబర్లు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సలర్స్, కార్పొరేటర్స్ తదితర ప్రజాప్రతినిధులకు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై అవగాహన కల్పించేందుకు బాధ్యతతో కూడిన విధులు నిర్వర్తించేందుకు ఈ కార్యాచరణ ప్రణాళిక ఉపకరిస్తుందని తెలిపారు. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, రోడ్ల మరమ్మతులు, రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగునీటి ఎద్దడి లేకుండా తగు చర్యలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఈ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. రానున్న కేబినెట్ సమావేశానికి సంబంధించిన ప్రతిపాదనలను రేపటిలోగా సమర్పించాలని సీఎస్ సూచించారు. కార్యదర్శులు సందీప్ సుల్తానియా, అహ్మద్ నదీమ్, ఎన్. శ్రీధర్, యోగితారాణా, కార్యదర్శులు క్రిస్టినా చొంగ్తు, టికె శ్రీదేవి, స్టీఫెన్ రవీంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





