తిరువనంతపురం, జులై 21: కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నేత, కేరళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ (101) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతిచెందారు. గత నెల 23న తీవ్ర అనారోగ్యానికి గురవ్వగా తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు ఆయన్ని తరలించారు. చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. వామపక్ష పార్టీలో చీలిక వచ్చిన అనంతరం సీపీఎంను స్థాపించిన వ్యక్తుల్లో అచ్యుతానందన్ ఒకరు. 1923 అక్టోబర్ 20న కేరళలో వెనుకబడిన ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. పేదరికం కారణంగా.. ప్రాథమిక స్థాయిలోనే ఆయన చదువును ఆపేశారు. అనంతరం బట్టలు కుట్టడంతోపాటు కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో పనిచేశారు. తర్వాత కార్మిక ఉద్యమంలో అడుగుపెట్టారు. 1940లో కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడయ్యారు. అనంతరం ట్రావెన్‌కోర్ సంస్థానానికి చెందిన భూస్వాములపై పోరాటం చేసి జైలుకు వెళ్లారు. 1964లో సీపీఐ జాతీయ కౌన్సిల్‌ను ఆయన వదిలేసి సీపీఎం ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. 1967 నుంచి 2016 వరకూ వరుసగా అసెంబ్లీకి ఆయన ఎన్నికయ్యారు. ఆ క్రమంలో మూడు సార్లు విపక్ష నేతగా, ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అవినీతికి వ్యతిరేకంగా అచ్యుతానందన్ పోరాటం చేశారు. రాష్ట్రంలో భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపారు. ఈ చర్యలతో అనేకమంది రాజకీయంగా దూరం జరిగినా వాటిని ఆయన పట్టించుకోలేదు.
కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ కన్నుమూత





