– కేసును ఛేదించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: నగరంలోని కోఠి ఎస్బీఐ ఏటీఎం వద్ద గత నెలలో కాల్పులు జరిగిన కేసును టాస్క్ఫోర్స్ పోలీసులు ఛేదించారు. ఈ కాల్పులకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఓ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా వారిని పోలీసులు విచారిస్తున్నారు. జనవరి 31న కోఠి ఎస్బీఐలో నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చిన రిన్షద్ అనే వ్యక్తి వచ్చాడు. అతడిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. అనంతరం అతడి వద్దనున్న రూ.6 లక్షల నగదుతో పాటు బాధితుడి వాహనాన్నీ తీసుకుని పరారయ్యారు. ఈ కాల్పుల్లో రిన్షద్ కాలికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటన స్థలానికి చేరుకుని రిన్షద్ను ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్బీఐ ఏటీఎం ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు జ్లలెడ పట్టారు. ఈ చోరీ అనంతరం నిందితులు కాచిగూడ డీమార్ట్ సమీపంలోని ప్రార్థనా మందిరంలోకి వెళ్లి.. దుస్తులు మార్చుకున్నట్లు గుర్తించారు. తర్వాత వాహనాన్ని రైల్వే స్టేషన్ వద్ద వదిలేసి పరారయ్యారు. అక్కడి నుంచి వారు రైలెక్కి పారిపోయారా? లేక బస్సు కానీ ఇతర వాహనంలో కానీ వెళ్లారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అలా నిందితుల్లో ఒకరిని ఫిబ్రవరి 16న హరియాణాలో అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అందుకోసం ఉత్తరప్రదేశ్, హరియాణా రాష్ట్రాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలించి ఎట్టకేలకు మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని హైదరాబాద్కు తీసుకువచ్చారు. వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


