అందుబాటులోకి కచ్చితమైన రేడియేషన్ చికిత్స

– నిమ్స్‌లో లినాక్ సేవలు ప్రారంభించిన మంత్రి దామోదర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7: నిమ్స్‌లో అత్యాధునిక లినాక్(లినియర్ యాక్సలరేటర్) సేవలను ప్రారంభించడంతో కేన్సర్ రోగులకు ఖచ్చితమైన రేడియేషన్ చికిత్స అందుబాటులోకి వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. రూ.33 కోట్లతో నిమ్స్ కేన్సర్ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన ఈ సేవలను ఆయన మంగళవారం ప్రారంభించారు. సేవల ప్రారంభంతో తెలంగాణలో క్యాన్సర్ చికిత్స మరింత బలోపేతం అవుతుందన్నారు. అనంతరం మహిళల కేన్సర్ స్క్రీనింగ్ క్యాంపును మంత్రి ప్రారంభించారు. ఈ ఆధునిక సాంకేతికతతో ట్యూమర్‌పై మాత్రమే ప్రభావం చూపించి, ఆరోగ్య కణజాలాన్ని కాపాడే చికిత్స అందించగలుగుతామన్నారు. ట్రూ బీమ్ సిస్టమ్‌తో తక్కువ సమయంలోనే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం కల్పించామని, కేన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆధునిక వైద్య సదుపాయాలను మరింత విస్తరిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో యేటా 55 వేల నుంచి 60 వేల కొత్త కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగించే విషయమన్నారు. కేన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని ప్రజల్లో అవగాహన పెంచుతున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా కేన్సర్ చికిత్స అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా చర్యలు చేపట్టామని, అన్ని జిల్లా కేంద్రాల్లో డే కేర్ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేసి సేవలను విస్తరిస్తున్నామని, ములుగు, ఆదిలాబాద్ వంటి మారుమూల ప్రాంతాల్లో కూడా కీమోథెరపీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. 46 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా ముందస్తు వ్యాధి నిర్ధారణకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈరోజు నుంచి నిమ్స్‌లో మహిళల కేన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ప్రారంభించామని, మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నామని చెప్పారు. 14 నుంచి 15 ఏళ్ల బాలికలకు ఉచితంగా టీకా అందిస్తూ గర్భాశయ కేన్సర్ నివారణకు కృషి చేస్తున్నామన్నారు. ఈరోజు కేన్సర్‌ను నోటిఫైబుల్ వ్యాధిగా ప్రకటిస్తున్నామని, తద్వారా ప్రతి కేన్సర్ కేసును నమోదు చేసే విధానం తీసుకొస్తున్నామని, కేన్సర్ రిజిస్ట్రీ ద్వారా ఖచ్చితమైన డేటాతో మెరుగైన ప్రణాళికలు రూపొందించగలుగుతామని చెప్పారు. కేన్సర్‌పై పోరాటం కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు, ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని మంత్రి దామోదర్ అన్నారు. కార్యక్రమంలో రవాణా శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ , ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *