రోడ్డు ప్రమాదాల్లో మృతులందరివీ ప్రభుత్వ హత్యలే!

గతంలో యుద్ధానంతరం సమీక్ష చేసుకొంటే తండ్రులను పోగొట్టుకున్న పిల్లలు కొడుకులను పోగొట్టుకొన్న తల్లితండ్రులు సోదరులు పోగొట్టుకున్న సోదరీ మణులు హృదయ విదారక గాథలు గుండెలను పిండివేసేటివి. ఇప్పుడు యుద్ధాలు అక్కర లేదు. నిత్య జీవితంలో వీధిలోనికి వెళ్లినా కాసంత దూరం పయనం పెట్టుకొన్నా తుదకు దైవ దర్శనానికి వెళ్లినా ప్రాణాలకు భద్రత లేకుండా పోతోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పట్టున నెల రోజుల వ్యవధిలో రెండు ఘోర  బస్సు ప్రమాదాలు సంభవించాయి ! యాదృచ్చికం కావచ్చు. రెండు సందర్భాల్లోనూ ఒక్కో చోట 19 మంది మృత్యువాత పడ్డారు. రెండు సందర్భాల్లో కూడా మృతి చెందిన వారికి క్షతగాత్రులకు ప్రభుత్వాలు అంతో ఇంతో నగదు చేతుల్లో పెట్టి తమ చేతులు దులుపుకున్నాయి. గుణపాఠాలు నేర్చుకున్న జాడ లేదు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోలేదు. వాస్తవంలో ఇవన్నీ ప్రభుత్వ హత్యలే! తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. దేశం మొత్తం మీద సంభవిస్తున్న ఈలాంటి సంఘటనల్లో వేలాది మంది రోజూ మృత్యువు వాత పడుతున్నారంటే ఇవన్నీ కూడా ఎక్కువ భాగం ప్రభుత్వ నిర్లక్ష్యం చేతగాని తనంతోనే..!

ముందుగా కర్నూలు దుస్సంఘటన పరిశీలించుదాం! ఎక్కడో ఈశాన్య రాష్ట్రాల్లో ఆల్ ఇండియా పర్మిట్లుగా రిజిస్ట్రేషన్ చేసి దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నో ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. ఈలాంటి బస్సులు ప్రతి రాష్ట్రంలో ఏ జిల్లాల గుండా తిప్పుతారో ఆయా జిల్లాల పోలీస్ రవాణా శాఖాధికారులకు వాటి యజమానులు నెలవారీ మామూళ్లు పంపుతారు. ఫలితంగా ఆ బస్సుల వైపు ఎవరూ కన్నెత్తి కూడా చూడరు. ఎన్ని లొసుగులు ఉన్నా  సరే. సరిగ్గా కర్నూలు వద్ద ప్రమాదం జరిగిన ప్రైవేటు బస్ మరీ చోద్యమైనది. సీటింగ్ గా బాడీ బిల్డ్ చేసినట్లు పర్మిట్ లో చూపెట్టారు. వాస్తవంలో స్లీపర్ బస్ గా తిప్పుతున్నారు. ఈ బస్సు హైదరాబాద్ బెంగళూరు మధ్య మూడు రాష్ట్రాల్లో తిరుగుతూ ఉంటే  ఈ మూడు రాష్ట్రాల్లో ఎక్కడా పోలీస్ రవాణా అధికారులు ఎప్పుడైనా చెక్ చేయలేదని నమ్మగలమా? చెక్ చేసి ఉంటే ఈ లొసుగులు గుర్తించ లేదా? మూడు రాష్ట్రాల అధికారాలు మామూళ్ల మత్తులో మునిగి పోయిన ఫలితంగా కర్నూలు వద్ద 19 మంది సజీవ దహనమైనారు.

ఇంతకీ కర్నూలు జిల్లా ద్వారా ఎన్నో మార్లు ఈ బస్సు పయనించి ఉన్నా  పోలీస్ రవాణా శాఖాధికారులు ఎందుకు చెక్ చేయ లేదని సంఘటన తర్వాతనైనా ప్రభుత్వం ఆరా తీసిన దాఖలా లేదు. పై నుండి కింద అంతా లాలూచీ ?దురదృష్టమేమంటే బస్ డ్రైవర్ బస్ యజమానులు మీద కేసులు నమోదు చేశారు. గాని వీరితో పాటు విధి నిర్వహణలో వైఫల్యం చెందిన తత్సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకొని ఉండాలి. ఈలాంటి నిర్లక్ష్యంతో దుర్ఘటన సంభవించినపుడు బాధ్యులైన అధికారులను కూడా బాధ్యులను చేస్తే ఇతర ప్రాంతాల్లోని అధికారులు కనీసం మున్ముందు అయినా జాగ్రత్తగా ఉండేవారు. సుపరిపాలన సాధ్యం కాదు కాబట్టే ఒక్క రవాణా శాఖలోనే కాకుండా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం చేష్టలుడిగి ఉంది . తమాషా ఏమంటే కర్నూలు దుస్సంఘటన తదుపరి రాష్ట్రం మీద అన్ని ప్రైవేటు బస్  లను తనిఖీ చేశారు. వందలాది కేసులు నమోదు చేశారు. అదే సంఖ్యలో బస్సులను సీజ్ చేశారు. కాని నాలుగు రోజులు గడచిందో లేదో ప్రైవేటు బస్ యజమానులు పైరవీలు చేసి సీజ్ చేసిన బస్ ల విడుదలకు ఉన్నత స్థాయిలో ప్రయత్నాలు చేసినట్లు మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ఇంతకీ ఎమ్మెల్యేలు మొదలు కొని మంత్రుల వరకు మామూళ్ల జాడ్యం వ్యాపించి ఉన్నందున సామాన్య ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా పోతోంది.

ఇక తెలంగాణలో చేవెళ్ల బస్ ప్రమాదం కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంతో సంభవించినదే. రహదారి విస్తరణ చాలా కాలంగా సాగుతోంది. రహదారి గుంతలమయంగా ఉంది . రోడ్డులో ఉండే  గుంతల నుండి టిప్పర్ ను తప్పించబోయి ఆర్టీసీ బస్ ను ఢీ కొట్టాడని చెబుతున్నారు . కర్నూలు దుస్సంఘటనలో అగ్నికీలల్లో 19 మంది సజీవ దహనమైతే చేవెళ్ల ప్రమాదంలో మెటల్ కింద పడి ఊపిరాడక పలువురు ప్రాణాలు కోల్పోయారు. మెటల్ లోడ్ తో రవాణా చేస్తున్న టిప్పర్లు పరిమితికి మించి లోడింగ్ చేస్తున్నా ఎచ్చట ఏ సందర్భంలోనూ పోలీస్ రవాణా శాఖాధికారులు తనిఖీ చేసింది లేదు. ఇందుకు ఎవర్ని నిందించాలి? నిజమైన ముద్దాయిలు ఎవరు? గ్రావెల్, మెటల్, ఇసుక రవాణా చేసే టిప్పర్లకు అడ్డూ అదుపు లేకుండా పోవడం రెండు రాష్ట్రాల్లో సర్వ సాధారణంగా ఉంది. ఈ అదుపు లేనందున చేవెళ్ల దుస్సంఘటనలో 19 మంది ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి.

కర్నూలు చేవెళ్ల దుర్ఘటనల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ప్రాణాలు తోడేస్తున్న రోడ్డు ప్రమాదాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. నిన్న మొన్నటి వరకు ద్విచక్ర వాహనాలు కారుల్లో ప్రయాణం గురించి భద్రత పరంగా సందేహించే వాళ్లం. ఇప్పుడు ప్రైవేటు బస్సు ల్లోనే కాకుండా ఆర్టీసీ బస్ ప్రయాణాలు కూడా ప్రమాదంలో పడింది. ఇంటి నుండి బయటకి వెళ్లిన వ్యక్తి తిరిగి క్షేమంగా ఇల్లు చేస్తారనే విశ్వాసం పోయింది.

ఇదిలా ఉండగా ఆంధ్ర ప్రదేశ్ లో ఆలయాల్లో కూడా రక్షణ కొరవడింది.రెండు దశాబ్దాల క్రితం ప్రముఖ కమ్యూనిస్టు అభ్యుదయ కవి గజ్జెల మల్లారెడ్డి గేయం రాస్తూ “తెలుగు నాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది. డ్రైనేజీ లేకుండా డేంజరుగా మారుతోందని చెప్పారు. నిజంగానే డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మల్లారెడ్డి గారు సజీవంగా ఉంటే  ఏలా చీల్చి చెండాడే వారో. . ఎంతో భక్తి భావంతో ఆలయాల కెళ్లుతున్న వారు శవాలుగా తిరిగి వస్తున్నారు. ఈ మారణహోమంలో మహిళలే సమిధలవుతున్నారు. నవంబర్ ఒకటవ తేదీ శ్రీ కాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తొక్కిసలాటలో తొమ్మిది మంది పోయారు. ఇది ప్రైవేట్ ఆలయమని చేతులు దులుపుకున్నారు. జనవరిలో తిరుమల ఆలయ ప్రవేశం టికెట్ల కొరకు తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరు మంది పోయారు. ఏప్రిల్ నెలలో విశాఖ లోని సింహాచలం ఆలయం చందనోత్సవం సందర్భంగా ఆలయంలో గోడ కూలి ఏడు మంది మృతి చెందారు. రోడ్డు ప్రమాదాల్లో గాని ఆలయాల తొక్కిసలాటలో గాని ‍నిమిత్తమాత్రంగా దుర్మరణం చెండటంతో ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఈ విష వలయంలో శోభనం కూడా పూర్తి కాకుండానే నవ వధువులు బలి పశువులౌతున్నారు.పెళ్లిపీటలు ఎక్కవలసిన వారు శవ పేటికలెక్క వలసి ఉంది
-వి. శంకరయ్య
విశ్రాంత పాత్రికేయుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page