హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 15: ఇరిగేషన్ శాఖలో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో గతంలో కీలకంగా పనిచేసిన అధికారుల అవినీతిపై ఏసీబీ దృష్టిసారించింది. ఇప్పటికే కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరామ్, ఈఈ నూనె శ్రీధర్‌లను ఏసీబీ అరెస్టు చేసిన విషయం విదితమే. తాజాగా మాజీ ఈఎన్‌సీ చెట్టి మురళీధర్ రావు బంజారాహిల్స్‌లోని ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు మంగళవారం ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. ఆయనను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. 2014లో బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టులో ఈఎన్‌సీగా నియమితులై కీలకంగా వ్యవహరించారు. హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ వంటి పదిచోట్ల సోదాలు జరుగుతున్నాయి. మురళీధర్ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భారీగా అక్రమాస్తులను ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్ట్ సబ్ కాంట్రాక్టుల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. మాజీ ఈఎన్‌సీ మురళీధర్ రావును కూడా కాళేశ్వరం కమిషన్ విచారించగా తనకు తెలియదు, మర్చిపోయాను అంటూ ఆయన సమాధానం చెప్పారు. విజిలెన్స్ నివేదికలో మాజీ ఈఎన్‌సీ మురళీధర్ రావు పేరును కూడా చేర్చారు. ఈ క్రమంలో సాయంత్రం వరకు ఏసీబీ సోదాలు కొనసాగే అవకాశం ఉంది.





