సెల్‌ఫోన్‌ ఇవ్వాల్సిందేనంటున్న ఏసీబి

కుదరదంటున్న మాజీ మంత్రి కెేటీఆర్‌
పట్టుదలగా వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 19: ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ కేసు ఇప్పుడు సెల్‌ఫోన్‌ చుట్టూనే తిరుగుతోంది. కేటీఆర్‌ సెల్‌ఫోనే ఏసీబీ అధికారులకు కీలకంగా మారింది ఆ ఫోను ఇచ్చేది లేదని కేటీఆర్‌ ఏసీబీకి కరాఖండిగా తేల్చి చెప్పారు. గతంలో వాడిన సెల్‌ఫోను ఇప్పుడు తన దగ్గర లేదని చెప్పారు. ఇందుకు సంబంధించి ఏసీబీ అధికారులకు కేటీఆర్‌ లిఖితపూర్వకంగా సమాధానం పంపారు. ఫోన్‌ ఇవ్వకపోతే తదుపరి చర్యలకు తాము సిద్ధమని ఏసీబీ అధికారులు అంటున్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం ఏసీబీ చెప్పడం లేదు. మరోవైపు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ఫోన్‌ అడగడం చట్ట వ్యతిరేకమని కేటీఆర్‌ వాదిస్తున్నారు. సెల్‌ఫోనుకు సంబంధించిన వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని, వాటి ప్రకారం ఎవరూ కూడా వ్యక్తిగత సమాచారం, సెల్‌ఫోన్‌ వంటివి అడగవద్దని అంటున్నారు. అంతేకాదు.. అసలు తన ఫోన్‌ వాళ్లకు ఎందుకు అవసరం అనే విషయాన్ని ఏసీబీ చెప్పడం లేదని అంటున్నారు. మరోవైపు ఈ ఏడాది నుంచి తాను కొత్త సెల్‌ఫోన్‌ వాడుతున్నట్లు తెలిపారు. సెల్‌ఫోన్‌ ఇవ్వడానికి అసలు కేటీఆర్‌ ఎందుకు వెనుకాడుతున్నాడో అర్థం కావడం లేదని ఏసీబీ అధికారులంటున్నారు. సెల్‌ఫోÛన్‌ ఇస్తే తమకు కావాల్సిన సమాచారం తీసుకుంటామని వాళ్లు వాదిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వ్యవహారాలు విచారించాలంటే సెల్‌ఫోన్‌ ఒక సాక్ష్యంగా ఉపయోగపడుతుందని, కేటీఆర్‌ దాన్ని తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని ఏసీబీ అధికారులు అంటున్నారు. ఈ ఫోన్‌ ద్వారానే ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ అధికారులతో సంప్రదింపులు జరిపారని, అంతేకాక డబ్బులు మొత్తం కూడా బదిలీ వ్యవహారం సంబంధించి దీంతోనే జరిగిందని, హెచ్‌ఎండిఏ అధికారులు కూడా ఈ ఫోన్‌ ద్వారానే ఆదేశాలు ఇచ్చారని, ఈ ఫోన్‌తో కొంత సమాచారం దొరుకుతుందని, కావున ఇవ్వాలని ఏసిబి పట్టుపడుతోంది. కేటీఆర్‌ ఇచ్చిన సమాధానంతో ఏసీబీ ఏం చేయాలో ఇప్పుడు లీగల్‌ టీంతో సమావేశమైంది. ఆ టీం ఇచ్చే సూచన సలహాలతో ఏసీబీ ముందుకు వెళుతుంది. అంతేకాదు ఎవిడెన్స్‌ అడిగితే ఇవ్వకపోతే దానికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. మరోవైపు ఈ కేసులో ఏసీబీకి పూర్తిస్థాయిలో సహకరించాలని విచారణ ఎదుర్కోవాలని ఇప్పటికే హైకోర్టు చెప్పింది. విచారణ సమయంలో ఏసీబీ అధికారులు అడిగిన ప్రతి దానికీ సమాధానం చెప్పవలసి ఉంటుంది. అంతేకాదు వాళ్లు అడిగిన సాక్ష్యాలను కూడా అందజేయవలసి ఉంటుంది. ఇపుడు ఏసీబీ ఏం చేస్తుందనేది అందరూ ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. రెండుసార్లు విచారణలో కేటీఆర్‌ తమకు సహకరించలేదని ఏసీబీ అధికారులు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *