-గత నెలలో 22 కేసులు నమోదు
– ఏడు నెలల్లో 148 కేసులు నమోదు
– రూ.30.32 లక్షల నగదు స్వాధీనం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 1: ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది లంచం డిమాండ్ చేస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ప్రజలకు అవినీతి నిరోధక శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం సూచించారు. అవినీతిని నిరోధించేందుకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. అందులో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు, స్టిక్కర్లు ద్వారా అవినీతికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసేలా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో అవినీతి అధికారులపై మెరుపు దాడులు చేసినట్లు చెప్పారు. జులై నెలలో మొత్తం 22 అవినీతి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఆ జాబితాలో ట్రాప్ చేయడం, లెక్కకు మించిన ఆదాయం కలిగి ఉండడం, క్రిమినల్ మిస్ కాండక్ట్ తదితర కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ట్రాప్ కేసుల్లో రూ.5.75 లక్షలు, లెక్కకు మించిన ఆదాయం కేసులో రూ.11.5కోట్ల విలువైన ఆస్తులు వెలుగులోకి వచ్చాయన్నారు. అలాగే ఆర్టీఏ, చెక్‌పోస్టులు, సబ్ రిజిస్ట్రార్ తదితర కార్యాలయాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు, ఆ సమయంలో లెక్కల్లోకి రాని రూ.1.49 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 148 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న మొత్తం 145 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని అరెస్టు చేశామన్నారు. అలాగే మొత్తం రూ.30.32 లక్షలు ట్రాప్ కేసుల్లో స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. లెక్కకు మించిన ఆదాయం కేసుల్లో ఆస్తుల విలువ రూ.39కోట్లకు పైగా ఉందన్నారు. మరోవైపు నీటిపారుదల శాఖలో పలువురు ఇంజనీర్లు, ఇంజనీర్ ఇన్ చీఫ్ మరళీధర్‌రావు, నూనె శ్రీధర్‌తోపాటు మరో ఇంజనీర్ హరిరామ్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ ముగ్గురు అధికారుల వద్దే దాదాపు రూ.1000 కోట్లకు పైగా అవినీతి నగదు ఉన్నట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు.



