– ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లలో ఎనిమిదిచోట్ల తనిఖీలు
హనుమకొండ, ప్రజాతంత్ర, ఆగస్టు 29 :హనుమకొండ జిల్లా కాజీపేట చైతన్యపురిలో ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వర్‌రావు ఇంట్లో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో నాగేశ్వర్ రావుకు చెందిన నివాసంతోపాటు ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్‌తో పాటు మొత్తం ఎనిమిదిచోట్ల ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లలో ఎనిమిది ఏసీబీ బృందాలు ఉదయం నుంచి సోదాలు చేపట్టాయి. తహసీల్దార్ కుటుంబ సభ్యుల ఇల్లు, అతడి కార్యాలయం, ఇతర ప్రాంగణాలతో సహా ఏడు (7) ప్రదేశాలలో సోదాలు జరిగాయి. సోదాల్లో ప్రాథమికంగా ఆయన వద్ద రూ.1.15 కోట్ల విలువైన ఇంటి ఆస్తులు, రూ.1,42,98,500 విలువైన 17 ఎకరాల 10 గుంటల విలువైన వ్యవసాయ భూమి పత్రాలు, రూ.23.84,700 విలువైన 70 తులాల బంగారు ఆభరణాలు, రూ.92.000 విలువైన వెండి వస్తువులు, రూ.34,78,000 విలువైన నాలుగు ఫోర్ వీలర్స్, ఒక ద్విచక్ర వాహనం. రూ.3,28,195 విలువైన 23 చేతి గడియారాలు, రూ.16,43,803 విలువగల గృహోపకరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఆస్తుల విలువ రూ.5,02.25,198 ఉంటుంది. ఇంకా అదనపు ఆస్తుల ధ్రువీకరణ జరుగుతోంది. ప్రస్తుత మార్కెట్ విలువలు ప్రభుత్వ విలువ కంటే గణనీయంగా ఎక్కువగా ఉన్నాయని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. తహసీల్దార్ నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఖమ్మంలోనూ తనిఖీలు
నాగేశ్వరరావు సొంత జిల్లా ఖమ్మంలో సైతం ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఆయన గతంలో ధర్మసాగర్, కాజీపేట, హసన్‌పర్తి మండలాల్లో తహసిల్దార్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆయనపై ఆరోపణలు వచ్చినట్లు, ఈ నేపథ్యంలో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలిసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



