గుజరాత్, పంజాబ్‌లో సీట్లు నిలబెట్టుకున్న ఆమ్ ఆద్మీ
కేరళలో ఎల్డీఎఫ్‌కు షాక్..కాంగ్రెస్ వశమైన నిలంబర్
రాజ్యసభకు వెళ్లడం లేదన్న ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్
న్యూదిల్లీ, జూన్ 23: గుజరాత్, పంజాబ్ ఉప ఎన్నికల్లో ఆప్ సత్తా చాటింది. గుజరాత్‌లో బిజెపికి ఓటమి తప్పలేదు. దేశ వ్యాప్తంగా జూన్ 19న ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా.. సోమవారం వోట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఉప ఎన్నికల్లో గుజరాత్‌లో ఆప్ ఒక స్థానాన్ని కైవసం చేసుకొని సత్తా చాటింది. విశావదర్ సీటు నుంచి బీజేపీ అభ్యర్థి కిరీట్ పటేల్‌పై ఆప్ నేత గోపాల్ ఇటాలియా 17 వేల పైచిలుకు వోట్ల తేడాతో విజయం సాధించారు. గుజరాత్‌లో భాజపాకు పూర్తి ఆధిపత్యం ఉన్నప్పటికీ.. 2007 నుంచి విశావదర్ స్థానాన్ని గెలుచుకోలేకపోతోంది. అయితే, గత ఎన్నికల్లో ఈ సీటులో ఆప్ కైవసం చేసుకున్న ప్పటికీ.. ఎమ్మెల్యే భూపేంద్ర భయానీ రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ ఆప్ విజయం సాధించింది. అలాగే, గుజరాత్‌లో కాడి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర చావ్డా విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ చావ్డాపై జయకేతనం ఎగురవేశారు. పంజాబ్‌లోని లుథియానా వెస్ట్ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార ఆప్ విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ అభ్యర్థి భరత్ భూషణ్ ఆషుపై ఆప్ అభ్యర్థి, రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోడా 10,637 వోట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ ఆప్ అభ్యర్థి అరోడాకు 35,179 రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి ఆషుకు 24,542 వోట్లు, బీజేపీ అభ్యర్థి జివాన్ గుప్తాకు 20,323 వోట్లు; అకాలీదళ్ అభ్యర్థికి కేవలం 8,203 వోట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక్కడ ఆప్ ఎమ్మెల్యే గురుప్రీత్ బస్సీ గోగి మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. గుజరాత్‌లోని విశావదర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆప్ విజయం సాధించడంపై కేజీవ్రాల్ హర్షం వ్యక్తం చేశారు. గుజరాత్ ప్రజలు బీజేపీతో విసిగివేసారిపోయారని, ఇప్పుడు వారంతా ఆప్ వైపే చూస్తున్నారన్నారు. గుజరాత్‌లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా విశావదర్‌లో ఆప్ అభ్యర్థి విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా కేజీవ్రాల్ మీడియాతో మాట్లాడుతూ ఆప్‌ని ఓడించేందుకు బీజేపీ, కాంగ్రెస్ పంజాబ్, గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజలు వారిని తిరస్కరించారన్నారు. పంజాబ్‌లోని లుథియానా పశ్చిమ స్థానంలోనూ ఆప్‌ను గెలిపించడం ద్వారా పంజాబ్ ప్రజలు తమ ప్రభుత్వ పనితీరుకు ఆమోదం తెలిపారన్నారు. గుజరాత్‌లో భాజపా, ఆప్ మధ్యే ప్రత్యక్ష పోటీ ఉందన్న ఆయన.. బీజేపీకి కాంగ్రెస్ కీలుబొమ్మగా మారిపోయిందని ఆరోపించారు. పంజాబ్‌లోని లుథియానా పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజీవ్ అరోడా విజయం సాధించారు. దీంతో ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే ఖాలీ అయ్యే ఈ స్థానం నుంచి కేజీవ్రాల్ పెద్దల సభలో అడుగుపెట్ట బోతున్నారంటూ విపక్షాలు పలు వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చాయి. ఈ క్రమంలో అరవింద్ కేజీవ్రాల్ స్పందించారు. తాను రాజ్యసభకు వెళ్లడం లేదని స్పష్టం చేశారు. మరోవైపు, కేరళలో నిలంబర్ అసెంబ్లీ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్‌కు షాక్ తగిలింది. ఈ సీటులో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ అభ్యర్థి ఆర్యదాన్ షౌకత్ సీపీఎం అభ్యర్థిపై 11,077 వోట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. షౌకత్ ప్రముఖ కాంగ్రెస్ నేత ఆర్యదాన్ ముహమ్మద్ తనయుడు. గత ఎన్నికల్లో ఎల్డీఎఫ్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన పీవీ అన్వర్ రాజీనామాతో ఈ సీటుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. మరోవైపు, పశ్చిమ బెంగాల్‌లోని కాలీగంజ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. టీఎంసీ అభ్యర్థి అలీఫా అహ్మద్‌కు 32,308 వోట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 13,144 వోట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ అభ్యర్థి 11,987వోట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. టీఎంసీ సిట్టింగ్ ఎమ్మెల్యే నసీరుద్దీన్ అహ్మద్ మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం కాగా.. ఆయన కుమార్తె అలిఫా అహ్మద్‌ను దీదీ బరిలో నిలిపారు.





